డిజిటల్ మోసాలపై కఠిన చర్యలు.. 70 లక్షల మొబైల్ నంబర్లు తొలగింపు

డిజిటల్ మోసాలపై కఠిన చర్యలు.. 70 లక్షల మొబైల్ నంబర్లు తొలగింపు

అనుమానాస్పద లావాదేవీల కారణంగా కేంద్ర ప్రభుత్వం 70 లక్షల మొబైల్ నంబర్లను తొలగించింది. డిజిటల్ మోసాలపై దృష్టి సారించిన ప్రభుత్వం.. తాజాగా ఈ చర్యలు తీసుకుంది. పెరుగుతున్న డిజిటల్ చెల్లింపు మోసాలను నిరోధించేందుకు బ్యాంకులు తమ వ్యవస్థలను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి ఈ సందర్భంగా సూచించారు.

నవంబర్ 28న ఆర్థిక సైబర్ భద్రతపై ఆర్థిక వ్యవహారాల శాఖ, రెవెన్యూ శాఖ, టెలికాం శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY), టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి వివిధ విభాగాల అధికారులు సమావేశమయ్యారు. ప్రభుత్వం ఆర్థిక సైబర్‌ సెక్యూరిటీని ఎదుర్కోవటానికి మరిన్ని సమావేశాలను ప్లాన్ చేస్తోందని, తదుపరి సమావేశం జనవరిలో జరుగుతుందని వివేక్ తెలిపారు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AEPS)లో మోసాల గురించి కూడా జోషి ఆందోళనలు లేవనెత్తారు. రాష్ట్రాలు దీన్ని పరిశీలించి డేటా రక్షణను నిర్ధారించాలని కోరారు.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తన డోంట్ డిస్టర్బ్ (DND) యాప్‌ను కూడా అప్‌డేట్ చేస్తోంది. నిరంతర స్పామ్ కాల్‌లు, సందేశాలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ యాప్ ను తీసుకురానుంది. మార్చి 2024 నాటికి, అప్‌డేట్ చేయబడిన DND యాప్ అన్ని పరికరాలకు అనుకూలంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్పామ్ కాల్‌లను నివేదించడానికి యూజర్స్ కు మరింత ప్రభావవంతమైన సాధనాన్ని అందిస్తుంది. దీంతో పాటు నకిలీ సిమ్ లతో జరిగే మోసాలను అరికట్టడానికి, స్పామ్ ల సంఖ్యను తగ్గించేందుకు డిసెంబర్ 1నుంచి దేశవ్యాప్తంగా కొన్ని కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది.