ఆర్టికల్ 70 రద్దు సబబే.. జమ్మూకాశ్మీర్‌‌‌‌పై కేంద్రానికి సుప్రీం మద్దతు

ఆర్టికల్ 70 రద్దు సబబే.. జమ్మూకాశ్మీర్‌‌‌‌పై కేంద్రానికి సుప్రీం మద్దతు
  • 3 వేర్వేరు తీర్పులు చెప్పిన కాన్‌‌స్టిట్యూషనల్ బెంచ్
  • ఆర్టికల్‌‌ 370 తాత్కాలిక ఏర్పాటే
  • దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని వెల్లడి
  • 2024 సెప్టెంబర్‌‌‌‌ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆర్డర్​

న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌‌‌‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ‘ఆర్టికల్ 370’ రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘ఆర్టికల్ 370’ని రద్దు చేస్తూ 2019 ఆగస్టు 5న కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏకగ్రీవంగా సమర్థించింది. వీలైనంత త్వరగా జమ్మూకాశ్మీర్‌‌‌‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ఆదేశించింది. 2024 సెప్టెంబర్‌‌‌‌లోగా ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆర్టికల్‌‌ 370 రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్‌‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌‌ ఆధ్వర్యంలోని కాన్‌‌స్టిట్యూషనల్ బెంచ్.. సోమవారం మూడు వేర్వేరు తీర్పులు చెప్పింది. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్‌‌ గవాయ్‌‌, జస్టిస్‌‌ సూర్యకాంత్‌‌ కలిసి ఒక తీర్పు.. జస్టిస్‌‌ సంజయ్‌‌ కిషన్‌‌ కౌల్‌‌, జస్టిస్‌‌ సంజీవ్‌‌ ఖన్నా మరో రెండు తీర్పులను వెల్లడించారు. ఈ తీర్పును బీజేపీ స్వాగతించగా.. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ వ్యతిరేకించాయి.

సార్వభౌమాధికారం కాదు

1947 నుంచి జమ్మూకాశ్మీర్‌‌‌‌కు ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ బద్ధమేనని సుప్రీం స్పష్టం చేసింది. ‘‘ఆర్టికల్‌‌ 370 అనేది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది’’ జస్టిస్‌‌ చంద్రచూడ్‌‌ పేర్కొన్నారు. ఆర్టికల్ 370.. అసమాన ఫెడరలిజం లక్షణమని, సార్వభౌమాధికారం కాదని తేల్చిచెప్పారు. నాడు రాష్ట్రంలో యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో ప్రత్యేక కారణాలతో తాత్కాలికంగా ‘ఆర్టికల్ 370’ని అమల్లోకి తెచ్చారని వివరించారు. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో జమ్మూకాశ్మీర్‌‌‌‌ కూడా సమానమేనని, భారత్‌‌లో అంతర్భాగమేనని చెప్పారు. మరోవైపు జమ్మూకాశ్మీర్‌‌ నుంచి లడాఖ్‌‌ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకాశ్మీర్‌‌లో రాష్ట్రహోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. 2024 సెప్టెంబరు 30వ తేదీలోగా జమ్మూకాశ్మీర్‌‌ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.

నాలుగేండ్ల కిందట..

జమ్మూకాశ్మీర్‌‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్‌‌ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. జమ్మూకాశ్మీర్‌‌‌‌ రాష్ట్రాన్ని రెండు (జమ్మూకాశ్మీర్, లడాఖ్) కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూకాశ్మీర్‌‌‌‌కు అసెంబ్లీ ఉంటుందని, త్వరలోనే రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రకటించింది. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌‌ డీవై చంద్రచూడ్‌‌ ఆధ్వర్యంలోని ఐదుగురు జడ్జిల కాన్‌‌స్టిట్యూషనల్ బెంచ్.. ఆగస్టు 2 నుంచి విచారణ జరిపింది. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వు చేసి.. సోమవారం తీర్పు చెప్పింది.

సుప్రీంతీర్పు అంతర్జాతీయ చట్టవిరుద్ధం: పాకిస్తాన్​

ఇస్లామాబాద్ :  ఏకపక్ష, చట్టవిరుద్ధమైన చర్యలను అంతర్జాతీయ చట్టం గుర్తించలేదని, ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ‘చట్టపరమైన విలువ’ లేదని పాకిస్తాన్ పేర్కొంది. ‘‘ఏకపక్ష, చట్టవిరుద్ధమైన చర్యలను అంతర్జాతీయ చట్టం గుర్తించదు. సుప్రీం కోర్టు తీర్పుకు ఎలాంటి చట్టపరమైన విలువ లేదు. యూఎన్​​సుప్రీంకోర్టు తీర్మానాల ప్రకారం కాశ్మీరీలకు స్వయం నిర్ణయాధికార హక్కు ఉన్నది” అని పాక్ ​విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ ట్వీట్​ చేశారు. పాక్​ మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ.. సుప్రీం కోర్టు తీర్పును ‘పక్షపాత నిర్ణయం’గా అభివర్ణించారు. ఈ తీర్పుతో కాశ్మీర్ ​స్వాతంత్ర ఉద్యమం మరింత బలంగా మారుతుందని వెల్లడించారు.

హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు జరగాలి

‘‘జమ్మూకాశ్మీర్‌‌‌‌ను నెమ్మదిగా ఇతర రాష్ట్రాలతో సమానంగా తీసుకురావడమే ఆర్టికల్ 370 ఉద్దేశం. జమ్మూకాశ్మీర్‌‌లో చోటుచేసుకున్న హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు జరగాలి. ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలి. 1980 నుంచి జమ్మూకాశ్మీర్​లో జరుగుతున్న హక్కుల ఉల్లంఘనలు, హింసపై కమిషన్‌‌ దర్యాప్తు చేపట్టాలి”

- జస్టిస్‌‌ సంజయ్‌‌ కిషన్‌‌ కౌల్‌‌