- వివిధ రాష్ట్రాల్లోని 41 డిస్టెన్స్ వర్సిటీల నుంచి సర్టిఫికెట్లు
- ఇప్పటికే కొన్ని ఫేక్ డాక్యుమెంట్లుగా గుర్తింపు
హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయడంలో భాగంగా చేపట్టిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో భారీగా డిస్టెన్స్ యూనివర్సిటీల సర్టిఫికెట్లు బయటపడుతున్నాయి. వాటిలో అసలువి ఏవో.. నకిలీవి ఏవో తెలియక ఇంటర్ బోర్డు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వెరిఫికేషన్ లో వివిధ రాష్ట్రాల్లోని 41 డిస్టెన్స్ యూనివర్సిటీల పేరుతో సర్టిఫికెట్లు దర్శనమిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కారు జూనియర్ కాలేజీల్లో 3,686 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. రెగ్యులరైజేషన్ ప్రకటనతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇంటర్మీడియెట్ కమిషనరేట్ లో కాంట్రాక్టు లెక్చరర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించారు. దీంట్లో చాలామంది సర్టిఫికెట్లు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గా గుర్తించారు. వీటిలో కొన్ని నకిలీ సర్టిఫికెట్లని తేలగా, మిగతా వాటి సంగతి ఎలా తెలుసుకోవాలనే ఆలోచనలో పడ్డారు. దేశ నలుమూలలకు చెందిన డిస్టెన్స్ యూనివర్సిటీల పేర్లు ఉండటంతో.. వాటిలో అసలువేవో, నకిలీవేవో గుర్తించడం కష్టంగా మారింది. దీంతో ఆ సర్టిఫికెట్లు జారీ చేసిన సమయానికి ఆ యూనివర్సిటీలకు గుర్తింపు ఉందా? లేదా? అనేది తెలుసుకునేందుకు ఇంటర్మీడియెట్ అధికారులు యూజీసీకి లేఖ రాసే యోచనలో ఉన్నారు. ఒకవేళ యూజీసీ గుర్తింపు ఉందని తేలితే.. ఆ సర్టిఫికెట్లను సంబంధిత యూనివర్సిటీలకు పంపి.. అవి ఒరిజినలేనా? కాదా? తెలియజేయాలని లేఖ రాయనున్నట్లు తెలిసింది.
