నిన్న టీఆర్‌‌‌‌ఎస్..​ ఇయ్యాల బీఆర్‌‌‌‌ఎస్.. రేపు వీఆర్‌‌‌‌ఎస్​ : చాడ వెంకటరెడ్డి

నిన్న టీఆర్‌‌‌‌ఎస్..​ ఇయ్యాల బీఆర్‌‌‌‌ఎస్.. రేపు వీఆర్‌‌‌‌ఎస్​ :  చాడ వెంకటరెడ్డి

టీఆర్‌‌‌‌ఎస్ పేరుతో వచ్చి ప్రజలను ముంచిన కేసీఆర్.. నేడు బీఆర్‌‌‌‌ఎస్ అని తెలంగాణను మర్చిపోయాడని, ప్రజలు రేపు ఆయన కుటుంబానికి వీఆర్‌‌‌‌ఎస్ ఇవ్వబోతున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆ పార్టీ బీజేపీకి పదేండ్లుగా బీ టీమ్‌‌గా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని అణచివేయడంతోనే తాము కాంగ్రెస్‌‌తో పొత్తుపెట్టుకున్నామని చెప్పారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌‌లోని అనబేరి సింగిరెడ్డి అమరుల భవన్‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మత రాజకీయాలు చేస్తున్న బీజేపీకి బీఆర్‌‌‌‌ఎస్ తోక పార్టీగా ఉంటూనే, తెలంగాణలో ప్రజాకంటక పాలన చేసిందని మండిపడ్డారు. 

ఆ రెండు పార్టీలను ఓడగొట్టి, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తమ పార్టీ కాంగ్రెస్‌‌తో పొత్తు కుదుర్చుకుందని చెప్పారు. కొత్తగూడెం సీటుతో పాటు మరో రెండు ఎమ్మెల్సీ పదవులను ఇవ్వాలనే ఒప్పందంతోనే ఆ పార్టీతో జతకట్టి, బీఆర్‌‌‌‌ఎస్, బీజేపీ ఓటమే లక్ష్యంగా పోరాడుతున్నామని తెలిపారు. కరువు ప్రాంతమైన హుస్నాబాద్ సెగ్మెంట్​లో నీళ్లు పారించేందుకు తాము నెత్తురింకించుకొని  పోరాడామన్నారు.

 శ్రీరాంసాగర్ వరద కాల్వ కోసం చేసిన పోరాటాల ఫలితంగానే ఇప్పటి గౌరవెల్లి ప్రాజెక్టు రూపుదిద్దుకుందని చెప్పారు. ఇక్కడ సీపీఐ అభ్యర్థులే ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుచేశారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఇప్పటి అభివృద్ధి పనులన్నీ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొదలుపెట్టినవే అన్నారు.