ప్రజలపై బీజేపీ బలవంతంగా ఉప ఎన్నికను రుద్దుతున్నది

ప్రజలపై బీజేపీ బలవంతంగా ఉప ఎన్నికను రుద్దుతున్నది

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని ఓడించగలిగే టీఆర్ఎస్‌కే మద్దతునివ్వాలని నిర్ణయించినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి చెప్పారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని ప్రమాదంలో పడేస్తున్న బీజేపీని దేశవ్యాప్తంగా ఓడించేందుకు కేవలం మునుగోడు ఉపఎన్నికకే పరిమితం కాకుండా భవిష్యత్‌లో కూడా కలిసి ప్రయాణం చేయనున్నట్టు తెలిపారు. శనివారం సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, హేమంతరావు, ఎన్.బాల మల్లేశ్‌తో కలిసి మీడియాతో చాడ వెంకట్ రెడ్డి మాట్లాడారు. సీపీఐ మద్దతుతోనే కాంగ్రెస్ నుంచి ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తన స్వార్థ ప్రయోజనాల కోసమే బీజేపీలో చేరారని, ప్రజలపై బీజేపీ బలవంతంగా ఉప ఎన్నికను రుద్దుతున్నదని ఆరోపించారు. ఉపఎన్నిక గురించి మునుగోడు నియోజకవర్గ పార్టీ కమిటీలతో చర్చించామని, అందరూ ఏక్రగీవంగా బీజేపీని ఓడించేందుకు టీఆర్ఎస్‌కు మద్దతునివ్వాలని సూచించినట్టు తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మునుగోడులో ఒంటరిగా సీపీఐ పోటీ చేసే పరిస్థితి లేదన్నారు. గతంలో మునుగోడు నుంచి పొత్తులతో సీపీఐ ఐదుసార్లు ప్రాతినిథ్యం వహించిందని గుర్తుచేశారు. ఉప ఎన్నిక ఆంబోతుల మధ్య పోటీలా మారిందన్నారు. విభజన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని బీజేపీకి మునుగోడులో ఓటు అడిగే హక్కు లేదన్నారు. టీఆర్ఎస్‌కు మద్దతిచ్చినంత మాత్రాన పోరాటాలు ఆగబోవని, డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి, ఇండ్ల స్థలాలు వంటి సమస్యలను పరిష్కరించాలని కేసీఆర్‌‌ను డిమాండ్ చేశారు. 

‘కేసీఆర్‌..‌ నిజాం’ అన్న మాటకు కట్టుబడి ఉన్న: నారాయణ

కేసీఆర్‌‌ను నిజాం అని చేసిన కామెంట్లకు తాను కట్టుబడి ఉన్నాననీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గతంలో జరిగిన పరిణామాలతో ఆ మాట అన్నానని, అయినప్పటికీ వెనక్కి తీసుకోబోనని స్పష్టం చేశారు. ఒకప్పుడు రాజగోపాల్ రెడ్డి తమకు మిత్రుడేనని, ఇప్పుడు శత్రువు పార్టీలో ఉన్నాడని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక సహజంగా వచ్చింది కాదని, మోడీ ప్రోద్భలంతో వచ్చిన అసహజ ఎన్నిక అని ఆరోపించారు. ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని జైళ్లకు పంపుతున్నారని విమర్శించారు.