
సిద్దిపేట, వెలుగు: రాజగోపాలరెడ్డి స్వార్థపూరిత ఆలోచన వల్ల మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని, ఇక్కడి నుంచి సీపీఐ పోటీ చేసే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. బుధవారం సిద్దిపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 19, 20న నిర్వహించే రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఉప ఎన్నికలో పోటీ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మునుగోడులో పోటీ చేయాలా వద్దా అనే అంశంపై అభిప్రాయాలు సేకరిస్తున్నామని, ఈ విషయంలో ఆచితూచి అడుగు వేస్తామన్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ ఉచితాలను కొనసాగించవద్దని మాట్లాడటం పేదల సంక్షేమానికి తూట్లు పొడవడమేనని మండిపడ్డారు.
బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు దేశంలో నాలుగు లక్షల కోట్ల నిరర్థక ఆస్తులుంటే ఇప్పుడవి 12 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లయినా విభజన చట్టాలు, హామీలను అమలు చేయడంలో కేంద్ర సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. దేశంలో బీజేపీ ఓటమే లక్ష్యంగా వామపక్షాలతో కలసి సీపీఐ మిలిటెంట్ పోరాటాలకు రూపకల్పన చేస్తోందన్నారు. టీఆర్ఎస్ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్చేశారు. సెప్టెంబరు 4 నుంచి 7 వరకు నిర్వహించే రాష్ట్ర మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. అనంతరం స్థానిక శివానుభవ మండపంలో నిర్వహించిన సిద్దిపేట జిల్లా పార్టీ మహాసభల్లో చాడ పాల్గొన్నారు.