
- మంత్రి తుమ్మలకు చాడ వినతి
హైదరాబాద్, వెలుగు: రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని సీపీఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి తెలిపారు. సోమవారం సెక్రటేరియట్ లో ఆయన ఈటీ నరసింహతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును కలిసి వినతి పత్రం అందించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేసి విడతల వారీగా అమలు చేయడంతో రైతులపై వడ్డీ భారం పడిందని చెప్పారు.
ప్రస్తుతం ప్రభుత్వం విధించిన షరతుల ప్రకారం కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో అందరి మొత్తాన్ని కలిపితే రూ.2 లక్షలు దాటుతుందని పేర్కొన్నారు. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో దాదాపు 40 శాతానికిపైగా రైతులకు రుణమాఫీ కాలేదని వివరించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఇంకా 3,724 మంది రైతులకు రుణమాఫీ పెండింగ్‌లో ఉందని తెలిపారు.