గంజాయి కేసులో సాక్ష్యంగా ఉంటరా? లేదా?

గంజాయి కేసులో సాక్ష్యంగా ఉంటరా? లేదా?
  • విద్యుత్​శాఖ సిబ్బందిపై చైతన్యపురి పోలీసుల ఒత్తిడి  
  •  డీసీపీకి అధికారులు, సిబ్బంది ఫిర్యాదు 

ఎల్బీనగర్, వెలుగు : సంబంధం లేని ఓ కేసులో సాక్షులుగా ఉండాలంటూ విద్యుత్ కార్మికులపై చైతన్యపురి పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. కొత్తపేట సబ్ స్టేషన్ లో విద్యుత్ శాఖ అసిస్టెంట్ లైన్ మెన్​ఎడ్ల జగన్, ఆర్టిజన్ శరత్ కుమార్ పని చేస్తున్నారు. సోమవారం రాత్రి 10 గంటలకు కొత్తపేట విద్యుత్ ఆఫీసుకు చైతన్యపురి కానిస్టేబుల్స్​బాల్ రాజు, దశరథతో పాటు సివిల్​డ్రెస్​లో ఉన్న మరొకరు వచ్చారు. సమీపంలో గంజాయి దొరికిందని, దానికి సాక్షులుగా ఉండాలని కోరారు. దీనికి జగన్, శరత్ ఒప్పుకోలేదు.

 ఈ విషయంలో సదరు కానిస్టేబుల్స్​కు, విద్యుత్ ​సిబ్బందికి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎలాగైనా సాక్ష్యం ఉండాలంటూ వారిని అక్కడి నుంచి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఎంతకీ వినకపోవడంతో  పోలీసులు జగన్, శరత్ సెల్​ఫోన్లను లాక్కొని పోయారు. ఈ దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్​మీడియాలో పెట్టారు. మంగళవారం ఉదయం విద్యుత్ శాఖ ఎస్సీ, డీఈ, ఏఈ, సిబ్బంది ఎల్బీనగర్ డీసీపీ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. మరోవైపు పోలీసుల తీరుకు నిరసనగా విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు.