సింగరేణిలో కొత్త గనులు ప్రారంభిస్తం.. సంస్థలో మరింత మందికి ఉపాధి కల్పిస్తం: మంత్రి వివేక్ వెంకటస్వామి

సింగరేణిలో కొత్త గనులు ప్రారంభిస్తం.. సంస్థలో మరింత మందికి ఉపాధి కల్పిస్తం: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • గనుల్లో అంతర్జాతీయ స్థాయి సేఫ్టీ చర్యలు చేపట్టాలి
  • వచ్చే వారం కోల్​బెల్ట్ ​ఏరియా ప్రజా ప్రతినిధులతో సీఎం సమావేశం 
  • బీఆర్ఎస్ ​హయాంలో కార్మికుల సంఖ్య లక్ష నుంచి 38 వేలకు తగ్గింది 
  • మందమర్రిలో కేకే-5 సింగరేణి బొగ్గు గనిలోకి దిగిన మంత్రి

మంచిర్యాల జిల్లా మందమర్రి, కోటపల్లి, చెన్నూరు మండలాల్లో మంత్రి వివేక్​ వెంకటస్వామి గురువారం పర్యటించారు. మందమర్రి ఏరియాలోని కల్యాణిఖని- 5 గనిలోకి దిగిన మంత్రి.. రక్షణ చర్యలను పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. మేడే సందర్భంగా శ్రమ శక్తి అవార్డులు పొందిన కార్మిక నాయకులను మంత్రి సన్మానించారు. గనుల్లో అంతర్జాతీయ స్థాయి రక్షణ చర్యలు చేపట్టాలని, జీరో యాక్సిడెంట్ లక్ష్యంగా పని చేయాలని సింగరేణి ఆఫీసర్లకు సూచించారు.  - కోల్​బెల్ట్​, వెలుగు

కోల్​బెల్ట్, వెలుగు: తెలంగాణలోని అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కొత్త బొగ్గు గనులను ప్రారంభించి మరింత మందికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి, కోటపల్లి, చెన్నూరు మండలాల్లో మంత్రి పర్యటించారు. 

మందమర్రి ఏరియాలోని కల్యాణిఖని-5 గనిలోకి దిగిన మంత్రి రక్షణ చర్యలను పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మేడే సందర్భంగా శ్రమ శక్తి అవార్డులు పొందిన కార్మిక నాయకులు ఎడుకోల పవన్​కుమార్, పుల్లూరి లక్ష్మణ్‌ను సింగరేణి ఆఫీసర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి మంత్రి సన్మానించారు. అనంతరం యూనియన్ ప్రతినిధులు, కార్మికులు మంత్రిని సన్మానించారు. కేకే-5 బొగ్గు గనిని తాను పదోసారి సందర్శిస్తున్నానని, అధిక ఉత్పత్తి సాధించడంతో పాటు రక్షణ చర్యల్లో ఈ గని అవార్డులు అందుకోవడం అభినందనీయమన్నారు. 

గనుల్లో అంతర్జాతీయ స్థాయి రక్షణ చర్యలు చేపట్టాలని, జీరో యాక్సిడెంట్ లక్ష్యంగా పని చేయాలని సింగరేణి ఆఫీసర్లకు సూచించారు. సింగరేణి కార్మికుల సమస్యలపై వచ్చే వారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు మంత్రి చెప్పారు. కోల్ బెల్ట్ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సింగరేణి సీఎండీ, ఆఫీసర్లు ఈ మీటింగ్‌లో పాల్గొంటారని తెలిపారు. కొత్త బొగ్గు గనుల ఏర్పాటు, పెర్క్స్​పై ఇన్‌కమ్ ట్యాక్స్ మాఫీ, మెడికల్ బోర్డు, కార్మికులకు సొంతిళ్లు, ప్రమోషన్లు తదితర సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు చెప్పారు. సింగరేణికి చెందిన ఖాళీ భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే కార్మికుల సొంతింటి కల నెరవేర్చవచ్చని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

  • సింగరేణిని ఆర్థికంగా వాడుకున్న బీఆర్ఎస్​..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను ఆర్థికంగా వాడుకుందే కానీ ఒక్క కొత్త బొగ్గు గని కూడా ప్రారంభించలేదని మంత్రి వివేక్ విమర్శించారు. వారి విధానాల వల్ల సంస్థలో కార్మికుల సంఖ్య లక్ష నుంచి 38 వేలకు తగ్గిందని వివరించారు. ఇక్కడ నుంచి డీఎంఎఫ్‌టీ, సీఎస్‌ఆర్ నిధులను సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలకు తరలించుకుపోయారని ఆరోపించారు. బొగ్గు బ్లాక్‌ల కోసం కేంద్రం చేపట్టిన వేలంలో సింగరేణి పాల్గొనకుండా బీఆర్‌‌ఎస్ అడ్డుకుందని, తాను సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి సింగరేణి వేలంలో పాల్గొని కొత్త బొగ్గు గనులు పొందేలా కృషి చేసినట్లు వివరించారు. 

రిటైర్డ్ కార్మికులకు కనీసం రూ.10 వేల పెన్షన్​అందేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈ అంశాన్ని పలుమార్లు పార్లమెంటులో లేవనెత్తారని గుర్తుచేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు కల్పించేందుకు తనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులతో కమిటీ వేశామని, త్వరలోనే వేతనాల పెంపుదలపై ప్రకటన చేస్తామన్నారు. 

  • సామాన్యులపై భారం మోపుతున్న కేంద్రం..

ముడి చమురు ధర తక్కువగా ఉన్నా పెట్రో ఉత్పత్తుల ధరలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని మంత్రి వివేక్‌ విమర్శించారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడానికి కేంద్రం విధిస్తున్న సెస్, ఎక్సైజ్​ సుంకాలు కారణమని విమర్శించారు. పెట్రోల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తెస్తే ధరలు తగ్గుతాయన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్​కుమార్, ఏజెంట్​రాంబాబు, తహసీల్దార్​సతీశ్, మున్సిపల్ కమిషనర్​ తుంగపిండి రాజలింగు పాల్గొన్నారు.