వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన రైల్వే వంతెన

వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన రైల్వే వంతెన

పంజాబ్, హిమాచల్ సరిహద్దులోని కాంగ్రా జిల్లాలోని చక్కి నదిపై నిర్మించిన 800 మీటర్ల పొడవైన రైల్వే వంతెన కుప్పకూలింది. చాకిరీలో ఆకస్మిక వరద రావడంతో వంతెన బలహీనపడిన పిల్లర్ కొట్టుకుపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు 90 ఏళ్ల చరిత్ర ఉన్న రైల్వే వంతెన ప్రస్తుతం ఇలా కావడానికి ముఖ్య కారణం నదీగర్భంలో దుండగలు చేసే అక్రమ మైనింగే. దీనిపై అక్కడి ప్రజలు పలుమార్లు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదు. గత నెలలో వంతెన యొక్క పిల్లర్‌లో పగుళ్లు ఏర్పడటంతో రైలు సేవలను నిలిపివేశారు. ఇప్పుడు ఆ స్తంభం ఇంకా బలహీనపడి కొట్టుకుపోయింది. దీంతో వంతెన యొక్క కొత్త పిల్లర్‌ను నిర్మించే వరకు పఠాన్‌కోట్,  జోగిందర్‌నగర్ మధ్య నారో గేజ్ రైలు సర్వీస్ ను నిలిపివేశారు.

1928లో బ్రిటిష్ వారు నిర్మించి ప్రారంభించిన ఈ నారో గేజ్ రైలు మార్గంలో పఠాన్‌కోట్, జోగిందర్ నగర్ మధ్య ప్రతిరోజూ ఏడు రైళ్లు నడిచేవి. పాంగ్ డ్యామ్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఉన్న వందలాది గ్రామాలకు ఈ రైలు మార్గమే జీవనాధారం. ఇక్కడ రోడ్లు సరిగా లేకపోవడంతో బస్సు సేవలు కూడా నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు కాంగ్రా జిల్లా కేంద్రానికి అనుసంధానించడానికి రైలు సేవలను ఉపయోగించుకుంటున్నారు. అంతే కాకుండా కాంగ్రా జిల్లాలోని చాలా నదులు ఉధృతంగా ప్రవహించడంతో, అనేక రహదారులు మూసుకుపోయాయి. ప్రభుత్వ, ప్రైవేట్ మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లింది. స్థానిక వాగులో వరదలు రావడంతో నాగోర్టా బగ్వాన్ ప్రాంతంలోని రాజీవ్ గాంధీ ఇంజినీరింగ్ కళాశాల భవనంలోకి నీరు చేరిందని డిప్యూటీ కమిషనర్ నిపున్ జిందాల్ తెలిపారు. దీంతో భవనం ఖాళీ చేయింటచారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.