బీజేపీలో చేరిన చంపయీ సోరెన్

బీజేపీలో చేరిన చంపయీ  సోరెన్
  • ఢిల్లీలో కాషాయ జెండా కప్పుకున్నజార్ఖండ్​ మాజీ సీఎం
  • ఈ నెల 28న జేఎంఎంకు రాజీనామా

న్యూఢిల్లీ: జార్ఖండ్  మాజీ సీఎం, జేఎంఎం సీనియర్  లీడర్  చంపయీ  సోరెన్.. బీజేపీలో చేరారు. అస్సాం సీఎం, జార్ఖండ్  బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జి హిమంత బిశ్వశర్మ, మధ్యప్రదేశ్  మాజీ సీఎం శివరాజ్  సింగ్  చౌహాన్  సమక్షంలో సోరెన్  శుక్రవారం ఢిల్లీలో కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తన కార్యకర్తలు, నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాతే బీజేపీలోకి చేరాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. జార్ఖండ్ లో సొంత  ప్రభుత్వం తనపై ఆరు నెలల పాటు నిఘా పెట్టిందని తీవ్ర ఆరోపణలు చేశారు. 

 జార్ఖండ్ లో గిరిజనుల జనాభా తగ్గుతోందని ఆయన చెప్పారు. గిరిజనుల ఉనికి కోసం పనిచేస్తానని చెప్పారు. గిరిజనుల అభివృద్ధి కోసం బీజేపీ పాటుపడుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. పార్టీ నాయకత్వం తనకు ఏ బాధ్యత ఇచ్చినా పూర్తిచేస్తానని తెలిపారు. జార్ఖండ్  ముక్తి మోర్చా (జేఎంఎం) పరిస్థితి దిగజారుతోందని, తాము ఏ సిద్ధాంతం కోసం పోరాడామో ఆ సిద్ధాంతం నుంచి పార్టీ పక్కదారి పడుతోందని పేర్కొన్నారు. అస్సాం సీఎం హిమంత శర్మ మాట్లాడుతూ చంపయీపై జార్ఖండ్ సర్కారు ఆరు నెలల పాటు నిఘా వేసిందని, దీనికి దీటైన జవాబు చెప్తామన్నారు. 

కాగా.. ఈ నెల 28న చంపయీ సోరెన్ జేఎంఎంకు రాజీనామా చేశారు. సర్కారు అనుసరిస్తున్న విధానాలు నచ్చకపోవడం వల్లే రాజీనామా చేస్తున్నట్లు హేమంత్​కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతకుముందు మనీ లాండరింగ్  కేసులో హేమంత్  సోరెన్  అరెస్టు కావడంతో ఫిబ్రవరి 2న చంపయీ సోరెన్.. జార్ఖండ్  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యాక హేమంత్  జులై  3న మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.