టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తనయుడు, రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఛాంపియన్’. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న మూవీ విడుదల కానుంది.
ఇటీవలే ఛాంపియన్ టీజర్ రిలీజ్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ వస్తున్నారు. ఇందులో భాగంగా లేటెస్ట్గా (నవంబర్ 26న) ఛాంపియన్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.
‘గిరా గిరా గిరా అగిరే’ అనే విలేజ్ బ్యాక్డ్రాప్ పాటతో అలరించడానికి వచ్చారు. మెలోడీ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ఈ పాటను రవి మిరియాల తనదైన మట్టి గొంతుతో పాడారు.
‘‘ఎర్ర ఎర్ర బొట్టు దిద్ది వెండి మేఘం మెరిసిందే.. పచ్చాని చీరకట్టి పంటచేనే మురిసిందే.. పరదాలే తీసేద్దాం.. ఏ మబ్బు ఎనుక ఏ చినుకు ఉందో.. ఏడా రాలునో.. ఏ తొవ్వలోన ఏ మలుపు ఉందో.. ఎడా ఆగునో సాగునో..’’ అనే పదాలను కాసర్ల శ్యామ్ చక్కగా రాశారు. ఆట సందీప్ కొరియోగ్రఫీ చేశారు.
ఈ పాట ఇందులోని హీరోయిన్ పరిచయ గీతంగా సాగింది. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్.. 'తాళ్లపూడి చంద్రకళ' అనే విలేజ్ గర్ల్ పాత్రలో కనిపిస్తుంది. చక్కటి రూపుతో.. ఊరిలో తన నైజాంని ఆకర్షించేలా సాగే పాట కొన్నాళ్లు శ్రోతల గుండెల్లో పరిగెత్తనుంది.
ఇదిలా ఉంటే.. కాసర్ల శ్యామ్ సాహిత్యం మరియు రామ్ మిరియాల గొంతు.. మట్టి వాసనను తెలుపుతాయి. వీరిద్దరి కలయికతో వచ్చిన పాటలన్నీ శ్రోతలను వీపరీతంగా ఆకట్టుకున్నాయి. దసరా సినిమాలోని "చమ్కీల అంగీలేసి" పాట బాగా ప్రాచుర్యం పొందింది. మరి ముఖ్యంగా "బలగం" సినిమాలోని "ఊరు పల్లెటూరు" పాట జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
ఎవరీ అనస్వర రాజన్:
చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ అందం.. పలు హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించింది. బాలీవుడ్లో యారియాన్2 లో అనశ్వర మెరిసింది. త్రిషతో కలిసి రాంగీ లో నటించింది. అలాగే, ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ‘7/జీ బృందావన కాలనీ’ సీక్వెల్లో సైతం నటిస్తుంది. ఆసిఫ్ అలీ నటించిన మిస్టరీ క్రైమ్ డ్రామా 'రేఖచిత్రం'లోను కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం సౌందర్య రజినీకాంత్ తెరకెక్కిస్తున్న 'విత్ లవ్' మూవీలో హీరోయిన్గా నటిస్తుంది.
