ENG vs SA: ఫలించని ఆఫ్ఘన్ ప్రజల ప్రార్థనలు.. సెమీస్‌కు దక్షిణాఫ్రికా

ENG vs SA: ఫలించని ఆఫ్ఘన్ ప్రజల ప్రార్థనలు.. సెమీస్‌కు దక్షిణాఫ్రికా

ఆఫ్ఘన్ ప్రజలు ప్రార్థనలు ఫలించలేదు. ఎటువంటి అద్భుతాలు జరగలేదు. కరాచీ గడ్డపై ఇంగ్లాండ్ జట్టును చిత్తుగా ఓడించిన సఫారీలు సగర్వంగా సెమీస్‌లో అడుగు పెట్టారు. శనివారం కరాచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 38.2 ఓవర్లలో 179 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని సఫారీ జట్టు 29.1 ఓవర్లలోనే చేధించింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా గ్రూప్-బిలో టాప్‌లో నిలిచింది. మరోవైపు, ఇంగ్లీష్ జట్టు ఓటమితో ఆఫ్ఘన్ల భవిష్యత్తు తేలిపోయింది. వారూ ఇంటికి బయదేరాల్సిందే. 

ఈ టోర్నీలో ఇంగ్లాండ్  జట్టుకు విజయమన్నదే లేదు. ప్రారంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో, అనంతరం ఆఫ్గనిస్తాన్ చేతిలో ఓడిన ఇంగ్లీష్ జట్టు.. శనివారం తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తయ్యింది.

పరువు దక్కలే..

ఇప్పటికే సెమీస్‌ నుంచి వైదొలిగిన ఇంగ్లాండ్‌.. ఆఖరి మ్యాచ్‌లో పంజా విసిరి పరువు దక్కించుకుంటారేమో అని అందరూ ఆశించారు. అంచనాలకు తగ్గట్టుగానే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ కాస్త దూకుడుగానే ప్రారంభమైంది. ఓపెనర్ ఫిలిప్‌ సాల్ట్ (8) రెండు బౌండరీలు కొట్టి ఊపు మీద కనిపించాడు. కానీ, కొద్దిసేపటికే వారి ఇన్నింగ్స్ తడబడింది. 

ALSO READ : Champions Trophy 2025: మమ్మల్ని ఓడించడానికి ఇండియా భయపడుతుంది: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

మార్కో జాన్సెన్(3 వికెట్లు), ముల్డర్(3 వికెట్లు), మహారాజ్(2 వికెట్లు) చెలరేగడంతో.. ఇంగ్లాండ్‌ 38.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. 37 పరుగులు చేసిన రూట్ టాప్ స్కోరర్. కెప్టెన్ జోస్ బట్లర్ (21), జోఫ్రా ఆర్చర్ (25) పర్వాలేదనిపించారు. మిగిలిన ఇంగ్లీష్ బ్యాటర్లంతా విఫలమయ్యారు.

క్లాసెన్, డస్సెన్ అర్ధ శతకాలు

స్వల్ప ఛేదనలో సఫారీలు ట్రిస్టన్ స్టబ్స్(0) వికెట్ కోల్పోగా.. ఆ తరువాత వచ్చిన ఇంగ్లాండ్ బౌలర్లను అతడుకున్నారు. హెన్రిచ్ క్లాసెన్ (56 బంతుల్లో 64; 11 ఫోర్లు), రాస్సీ వాన్ డెర్ డస్సెన్(87 బంతుల్లో 72; 6 ఫోర్లు, 3 సిక్స్ లు) ఇద్దరూ అర్ధ శతకాలు బాదారు. ర్యాన్ రికెల్టన్(27) పర్వాలేదనిపించారు.

న్యూజిలాండ్‌తో భారత్ ఆఖరి పోరు

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇక ఒకే ఒక లీగ్ మ్యాచ్ మిగిలి ఉంది. అది భారత్ vs న్యూజిలాండ్. ఈ మ్యాచ్‪ ఆదివారం జరగనుంది. ఆ మ్యాచ్‍లో విజయం సాధించిన జట్టు అగ్రస్థానాన్ని చేరుకుంటుంది. ఇందులో భారత జట్టు గెలిస్తే.. మన ప్రత్యర్థి ఆస్ట్రేలియా. అదే ఓడినా లేదా రద్దయినా మన ప్రత్యర్థి.. దక్షిణాఫ్రికా.