బడ్జెట్‌పై ఆరోపణలు చేస్తే ఎక్కడికక్కడ అడ్డుకుంటాం : చనగాని దయాకర్

బడ్జెట్‌పై ఆరోపణలు చేస్తే ఎక్కడికక్కడ అడ్డుకుంటాం : చనగాని దయాకర్
  • కేటీఆర్, హరీశ్‌ రావుపై చనగాని దయాకర్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్‌ నేతలు తమ రాజకీయ మనుగడ కోసం రాష్ట్ర బడ్జెట్ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ మండిపడ్డారు. అన్ని వర్గాలకు, రంగాలకు సమన్యాయం చేసేలా ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించిందని..సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. శనివారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే భయంతోనే కేటీఆర్, హరీశ్‌రావు బడ్జెట్‌పై అనవసర విమర్శలు చేస్తున్నారని తెలిపారు. 

మరోసారి బడ్జెట్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ కేడర్ ఊరుకోదని.. కేటీఆర్, హరీశ్‌లను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. పారదర్శకమైన బడ్జెట్‌ను ప్రశంసించాల్సింది పోయి విమర్శించడం సరికాదని హితవు పలికారు. సోమవారం నుంచి అసెంబ్లీలో జరగబోయే బడ్జెట్ చర్చల్లోనైనా బీఆర్‌ఎస్‌ నేతలు వాస్తవాలను మాట్లాడాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గల్లంతవడం ఖాయమని చనిగాని పేర్కొన్నారు.