చనాఖా-కొరాట నుంచి ఆదిలాబాద్ కు తాగునీరు

చనాఖా-కొరాట నుంచి ఆదిలాబాద్ కు తాగునీరు
  • గ్రావిటీ ద్వారా 20 కిలోమీటర్లు నీటి సరఫరా 
  •     రూ. 54 కోట్లతో ప్రతిపాదనలు రెడీ
  •     పట్టణంలో తాగునీటి ఎద్దడి శాశ్వత పరిష్కారానికి మార్గం

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్  పట్టణ ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా దూరం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం మిషన్ భగీరథ నీటితో పాటు మావల చెరువు, లాండసాంగ్వి వాగు నుంచి జిల్లా కేంద్రానికి నీళ్లు సప్లై అవుతున్నాయి. ఈక్రమంలో భోరజ్  మండలంలో పెన్ గంగా నదిపై నిర్మించిన చనాఖ–కొరాట ప్రాజెక్టు నుంచి సైతం జిల్లా కేంద్రానికి నీటిని సప్లై చేసేలా మున్సిపల్  అధికారులు ప్రపోజల్స్​ రెడీ చేశారు.

ఈ ప్రపోజల్స్​ కలెక్టర్  ద్వారా రెండు రోజుల్లో ప్రభుత్వానికి పంపనున్నారు. ఇప్పటికే ఈ అంశంపై కలెక్టర్  రాజర్షిషా అధికారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆదిలాబాద్  పట్టణ ప్రజలకు తాగునీటి గోస తీరనుంది. 

రూ.54 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు

ఆదిలాబాద్  పట్టణంలో భవిష్యత్​లో నీటి ఎద్దడి రాకుండా, నిరంతరాయంగా తాగునీటి సరఫరా కోసం ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా చనఖా–కొరాట ప్రాజెక్టు నుంచి నీటిని సప్లై చేసేందుకు రూ.54 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. మున్సిపల్, ఆర్​డబ్ల్యూఎస్, ఇరిగేషన్, మున్సిపల్  పబ్లిక్  హెల్త్  అధికారులు ప్రాజెక్టును సందర్శించి నివేదిక తయారు చేశారు. చనఖా–కొరాట ప్రాజెక్టు దగ్గర ఇంటెక్  వెల్, ట్రాన్స్​ఫార్మర్, మోటార్లు ఏర్పాటు చేసి నీటిని పంపింగ్ చేస్తారు.

24 కిలోమీటర్ల పైప్ లైన్ లో భాగంగా ప్రాజెక్టు నుంచి 4 కిలోమీటర్ల వరకు నీటిని పంపింగ్  చేసి, అక్కడి నుంచి 20 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా ఆదిలాబాద్ పట్టణానికి నీటి సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందించారు.

ఈ ప్రాజెక్టు నుంచి 6.5 (ఎంఎల్డీ) వన్  మిలియన్  లీటర్ల నీటిని సరఫరా చేసేందుకు ఇరిగేషన్  అధికారులు అనుమతి ఇచ్చారని మున్సిపల్  అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు నుంచి సరఫరా అయ్యే నీటిని నిల్వ చేసి శుద్ధి చేసేందుకు మావల పోలీస్ స్టేషన్  ప్రాంతంలోని ప్రభుత్వ స్థలంలో 20 ఎంఎల్డీ కెపాసిటీ కలిగిన వాటర్  ట్రీట్మెంట్  ప్లాంట్ నిర్మించనున్నారు.

ఇక్కడ శుద్ధి చేసిన తర్వాత పక్కనే ఉన్న కేఆర్కే కాలనీలో నిర్మిస్తున్న 18 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న భారీ వాటర్  ట్యాంక్ కు పంపుతారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా పట్టణంలోని అన్ని వార్డులకు నీటిని సరఫరా చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం లాండసాంగ్వి వాగు నుంచి సరఫరా అయ్యే నీటిని సైతం ఈ ట్యాంక్​కు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. దీంతో పాటు సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టుల నుంచి సైతం నీటి సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 

శాశ్వత పరిష్కారం..

ఆదిలాబాద్  పట్టణంలోని 49 వార్డులు ఉండగా 1.80 లక్షల జనాభా ఉండగా, పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలోని మావల చెరువు, 5 కిలోమీటర్ల దూరంలోని లాండసాంగ్వి వాగుతో పాటు శ్రీరాంసాగర్  ప్రాజెక్టు నుంచి నిర్మల్  జిల్లాలోని మాటేగాం మీదుగా మిషన్  భగీరథ నీరు సప్లై అవుతోంది. పట్టణ ప్రజలకు ఈ మూడు పథకాల నుంచి 25 ఎంఎల్డీల నీటి సరఫరా జరుగుతోంది.

అయితే చాలా కాలనీలకు మిషన్  భగీరథ నీళ్లు పూర్తి స్థాయిలో సరఫరా కావడం లేదు. ఏప్రిల్, మే నెలల్లో పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తుతోంది. గతేడాది లాండసాంగ్వి వాగులో నీరు అడుగంటిపోవడంతో జేసీబీతో తవ్వి నీటిని పంపింగ్  చేయాల్సి వచ్చింది. ఈక్రమంలో శాశ్వత పరిష్కారం కోసం చనఖా– కొరాట ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా చేసేందుకు రూపొందించిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే పట్టణ ప్రజలకు నీటి సమస్య తీరినట్లేనని అంటున్నారు. 

ప్రపోజల్స్​ రెడీ చేశాం

జిల్లా కేంద్రానికి చనాఖా–కొరాట ప్రాజెక్టు నుంచి తాగునీటి సరఫరా కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాం. కలెక్టర్  ద్వారా ప్రపోజల్స్​ ప్రభుత్వానికి పంపిస్తాం. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక డీపీఆర్  రెడీ చేస్తాం. ఈ ప్రాజెక్టుకు అనుమతి వస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. 
- జి.రాజు, మున్సిపల్  కమిషనర్