MBBS కౌన్సెలింగ్‌‌పై రేపు తుది తీర్పు వచ్చే చాన్స్‌‌

MBBS కౌన్సెలింగ్‌‌పై రేపు తుది తీర్పు వచ్చే చాన్స్‌‌
  • 12 రోజుల్లో పనైతదా?
  • కౌన్సెలింగ్‌‌పై   వీడని సందిగ్ధం 
  • రేపు తుది తీర్పు వెలువడే చాన్స్‌‌!
  • ఆ తర్వాత 3 విడతల కౌన్సెలింగ్‌‌కు 12 రోజులే
  • ఆగస్టు 31లోపు ప్రక్రియంతా పూర్తవ్వాల్సిందే
  • లేదంటే 400 సీట్లు వృథాగా పోయే ప్రమాదం
  • గడువు లోపు పూర్తి చేస్తామంటున్న హెల్త్ వర్సిటీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎంబీబీఎస్‌‌‌‌ కౌన్సెలింగ్‌‌‌‌ సందిగ్ధంతో ఇటు స్టూడెంట్లు, అటు హెల్త్‌‌‌‌ వర్సిటీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం కోర్టు తుది తీర్పు వచ్చే అవకాశం ఉండటం, ఆ తర్వాత కౌన్సెలింగ్‌‌‌‌కు 12 రోజులే ఉండటంతో టైం సరిపోదని అయోమయంలో ఉన్నారు. ఆగస్టు 31లోపు కౌన్సెలింగ్‌‌‌‌ చేయకపోతే 400 సీట్ల వరకు వృథాగా పోతాయని స్టూడెంట్లు ఆవేదన చెందుతున్నారు. హెల్త్‌‌‌‌ వర్సిటీ మాత్రం గడువులోపు పూర్తి చేస్తామని చెబుతోంది.

పొరపాట్లపై కోర్టుకు

కన్వీనర్ కోటా రెండో విడత కౌన్సెలింగ్‌‌‌‌లో జరిగిన పొరపాట్ల వ్యవహారం కోర్టుకు చేరడంతో ఎంబీబీఎస్‌‌‌‌ కౌన్సెలింగ్‌‌‌‌కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. సీట్ల కేటాయింపులో రిజర్వేషన్‌‌‌‌ నిబంధనలు పాటించకపోవడంతో తమకు అన్యాయం జరిగిందని కొందరు స్టూడెంట్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కౌన్సెలింగ్‌‌‌‌పై కోర్టు స్టే ఇచ్చింది. ఇరువర్గాల వాదనలు విన్నాక తీర్పును రిజర్వ్‌‌‌‌లో పెట్టింది. సోమవారం తుది తీర్పు వెలువడే అవకాశముందని వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. అయితే నిబంధనల ప్రకారం ఆగస్టు 31లోపే కౌన్సెలింగ్‌‌‌‌ చేయాలి. అంటే సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు మిగిలింది 12 రోజులే. ఈ టైంలో 3 విడతల కౌన్సెలింగ్ పూర్తి చేయాలి. లేదంటే ఈడబ్ల్యూఎస్‌‌‌‌కు కేటాయించిన 190 సీట్లు, నేషనల్‌‌‌‌ పూల్‌‌‌‌ నుంచి వెనక్కు వచ్చిన 61 సీట్లు, రెండో విడత తర్వాత స్టూడెంట్లు చేరకుండా మిగిలిన 160 సీట్లు కలిసి 411 సీట్లు వృథాగా పోతాయని వాటిపై ఆశలు పెట్టుకున్న స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

12 రోజులు.. 3 విడతలు

రెండో విడతలో తప్పు జరిగినట్టు కోర్టు భావించినా ఇప్పటికిప్పుడు రీ కౌన్సెలింగ్‌‌‌‌ జరపడం అంత సులువు కాదు. ఇప్పటికే రెండో విడతలో కేటాయించిన సీట్లలో స్టూడెంట్లు చేరారు. ఈ ప్రక్రియను రద్దు చేసి తిరిగి దరఖాస్తులు ఆహ్వానించడం, మెరిట్ జాబితా రూపొందించడం, సర్టిఫికెట్‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌ చేయడం, సీట్లు కేటాయించడం, స్టూడెంట్లు చేరేందుకు టైం ఇవ్వడం.. అంతా కలిపి వారమైనా అవుతుంది. ఈ లోపల సీట్లు కోల్పోయిన స్టూడెంట్లెవరైనా సుప్రీంకోర్టుకు పోతే మరింత ప్రమాదం తప్పదు. అయితే ఆగస్టు 31లోగా ప్రవేశాలు పూర్తి చేయాలన్న సుప్రీం ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని తీర్పిస్తామని కోర్టు పేర్కొంది. కాబట్టి రెండో విడతలో కేటాయించిన సీట్ల జోలికి పోకుండానే నష్టపోయిన స్టూడెంట్లకు న్యాయం జరిగేలా కోర్టు తీర్పు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

అనుకూలంగా వచ్చినా కష్టమే

ఒకవేళ కోర్టు తీర్పు హెల్త్‌‌‌‌ వర్సిటీకి అనుకూలంగా వచ్చినా మరో మూడు రౌండ్ల కౌన్సెలింగ్‌‌‌‌ నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ కన్వీనర్ కోటా రెండు విడతలు, మేనేజ్‌‌‌‌మెంట్ కోటా మొదటి విడత కౌన్సెలింగే జరిగాయి. మూడో విడత కన్వీనర్ కోటా, ఈడబ్ల్యూఎస్‌‌‌‌.. మేనేజ్‌‌‌‌మెంట్ కోటా రెండో విడత, కన్వీనర్‌‌‌‌‌‌‌‌ కోటా మాప్‌‌‌‌ అప్‌‌‌‌ రౌండ్‌‌‌‌ కౌన్సెలింగ్‌‌‌‌ నిర్వహించాల్సి ఉంది. మూడో విడత కన్వీనర్ కోటా సీట్లతో పాటే ఈడబ్ల్యూఎస్ భర్తీ చేస్తామని హెల్త్‌‌‌‌ వర్సిటీ వెల్లడించింది. ఇది పూర్తైతేగానీ మేనేజ్‌‌‌‌మెంట్ కోటా కౌన్సెలింగ్‌‌‌‌ చేయడానికి వీలుండదు. ఈ అన్ని రౌండ్ల తర్వాతే మాప్‌‌‌‌ అప్ రౌండ్ నిర్వహిస్తారు. ఇందులో కూడా సీట్లు మిగిలితే ఎన్‌‌‌‌ఆర్ఐ కోటాలో కాలేజీలు భర్తీ చేసుకుంటాయి. ఇవన్నీ చేసేందుకు మామూలుగా 20 నుంచి 25 రోజులు టైం పడుతుంది. కానీ సోమవారం తీర్పొస్తే వర్సిటీకి మిగిలేది 12 రోజులే. ఈ టైంలోనే మూడు రౌండ్ల కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

పూర్తి చేస్తం

కోర్టు తీర్పు ఎలా ఉన్నా గడువులోగా కౌన్సెలింగ్ పూర్తి చేస్తాం. ఇంత తక్కువ గడువులో కష్టమే అయినా స్టూడెంట్లు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. – కరుణాకర్‌‌‌‌రెడ్డి, హెల్త్‌‌ యూనివర్సిటీ వీసీ