- ఖైదీగా ఒక్కరోజు జైలు జీవిత అనుభవం
- నేడు గవర్నర్ చేతుల మీదుగా ‘ఫీల్ ది జైల్’ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: నేరాలు చేసి జైలుకెళ్తే అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యక్ష అనుభవం కలిగించేందుకు రాష్ట్ర జైళ్ల శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. జైలు నాలుగు గోడల మధ్య ఖైదీల జీవితాన్ని సామాన్యులు స్వయంగా అనుభవించేలా ‘ఫీల్ ది జైల్’ కు శ్రీకారం చుడుతోంది. ఈమేరకు చంచల్‌గూడ సెంట్రల్ జైలు పరిసరాల్లోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్(సికా)లో ఏర్పాటుచేసిన ఫీల్ ది జైల్, మ్యూజియాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మంగళవారం ప్రారంభించనున్నారు. అనంతరం సందర్శకులను “వన్ డే జైల్ ఎక్స్‌పీరియన్” కోసం అనుమతిస్తారు.
జైలు గోడల మధ్య 24 గంటలు
ఫీల్ ది జైల్‌తో పాటు మ్యూజియం సందర్శన కోసం ముందుగా జైల్ వెబ్‌సైట్ పోర్టల్‌లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్స్ ఆధారంగా సీరియల్‌నంబర్ ప్రకారం జైలులోకి ఒక రోజు అనుమతిస్తారు. ఇందుకోసం ప్రత్యేక మ్యాన్యువల్‌ను, పాత జైలు పరిసరాల్లో ఏర్పాట్లు చేశారు. రూ.500 లేదంటే వెయ్యి ఎంట్రీ ఫీజుగా నిర్ణయించనున్నారు. 24 గంటల పాటు జైలులో గడిపేలా ఎంట్రీ సమయంలోనే సందర్శకులకు షరతులు తెలియచేస్తారు. మొబైల్ ఫోన్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు. ఒకరోజు జైలులో ఉండే పరిస్థితులను వివరిస్తారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన స్పెషల్ బ్యారక్‌లో ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేశారు. ఫీల్ ది జైలులోకి వెళ్లిన వారికి జైలు గేట్ బయటి నుంచే వర్తింపజేస్తారు.
ఖైదీలు ధరించే డ్రెస్, చాప, గ్లాస్, సెల్‌లో నిద్ర
ఏంట్రీ గేట్ వద్ద బార్ కోడ్ అనంతరం నిజమైన ఖైదీలు ధరించే దుస్తులు ధరించాలి. బ్యారక్‌లోని ఒక గదిలో పడుకోవడానికి చాప, తాగడానికి ఒక గ్లాసు ఇస్తారు. ఉదయం 5 గంటలకు నిద్ర లేచి ఎవరి గదిని వారే శుభ్రం చేసుకోవాలి. జైలు మ్యాన్యువల్ ప్రకారం.. నిజమైన ఖైదీలకు అందించిన భోజనమే ఫీల్ ది జైలులో ఉన్నవారికీ అందిస్తారు. పరిసరాలను శుభ్రం చేసే పనులు అప్పగిస్తారు. అనంతరం సెల్‌లో వేసి తాళాలు వేస్తారు. ఇలా రిమాండ్ ఖైదీలు, శిక్ష పడ్డ ఖైదీల పరిస్థితి ఎలా ఉంటుంది.. సౌకర్యాలపై కనీసం ఒక్క రోజైనా జైలు జీవితం గడిపి అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకోవాలనే అవకాశం ఉంటుంది. నిబంధనల ప్రకారం జైలులో ఉండలేక మధ్యలో వెళ్లిపోతామంటే మాత్రం రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది
