
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌కు లోన్మంజూరు చేసినందుకు రూ.64 కోట్ల లంచం తీసుకున్నట్టు నమోదైన కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్‌ను అప్పిలేట్ ట్రిబ్యునల్ దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ కూడా నిందితులే. 2012లో చందా కొచ్చర్ నేతృత్వంలోని ఐసీఐసీఐ బ్యాంక్, వీడియోకాన్ గ్రూప్‌కు రూ.3,250 కోట్ల భారీ లోన్ మంజూరు చేసింది.
ఈ లోన్ మంజూరైన కొన్ని నెలలకే, వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్, చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు చెందిన "న్యూపవర్ రెన్యువబుల్స్" అనే సంస్థలో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ వ్యవహారం "క్విడ్ ప్రో కో" (ఏదో ఒకటి పొందేందుకు ఏదో ఒకటి ఇవ్వడం) కిందకు వస్తుందని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. లోన్ మంజూరుకు ప్రతిఫలంగా చందా కొచ్చర్ కుటుంబం లాభపడిందని స్పష్టం చేశాయి. వీడియోకాన్ గ్రూప్‌కు ఇచ్చిన లోన్ తరువాత మొండిబాకీగా మారింది. దీంతో బ్యాంకుకు నష్టం వాటిల్లింది.
లంచం ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ప్రారంభించాయి. చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్ వేణుగోపాల్ ధూత్‌లపై మనీలాండరింగ్, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దర్యాప్తులో భాగంగా ఈడీ చందా కొచ్చర్ కుటుంబానికి చెందిన ముంబైలోని ఫ్లాట్, డబ్బు పెట్టుబడులను జప్తు చేసింది. 2022 డిసెంబర్‌లో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ ధూత్‌లను సీబీఐ అరెస్టు చేసింది. దీంతో 2018 అక్టోబర్‌లో చందా ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో ఎండీ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది.
అప్పీలేట్ ట్రిబ్యునల్ ఈ కేసులో చందాను దోషిగా నిర్ధారించింది. ఆమె కుటుంబం లంచం పొందిందని, లోన్ మంజూరులో దురుద్దేశం ఉందన్న ఈడీ వాదనను సమర్థించింది. రూ.64 కోట్ల లంచం బదిలీకి ఎస్ఈపీఎల్, న్యూపవర్ రెన్యువబుల్స్ సంస్థలు కేంద్రంగా పనిచేశాయని కోర్టు పేర్కొంది. రూ.300 కోట్ల లోన్ మంజూరైన మరుసటి రోజే రూ.64 కోట్ల లంచం చెల్లింపు జరిగిందని దర్యాప్తులో వెల్లడైంది. 2024 ఫిబ్రవరిలో బాంబే హైకోర్టు, చందా కొచ్చర్ దీపక్ కొచ్చర్‌ల అరెస్టు చట్టవిరుద్ధమని పేర్కొంటూ వారికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తీర్పు రావాల్సి ఉంది.