ICICI బ్యాంకుపై హైకోర్టుకు చందాకొచర్

ICICI బ్యాంకుపై హైకోర్టుకు చందాకొచర్

ముంబై: తనను ఐసీఐసీఐ బ్యాంకు అన్యాయంగా తొలగించిందని, రూల్స్‌‌ను పట్టించుకోలేదని మాజీ ఎండీ, సీఈఓ చందా కొచర్‌‌ బాంబే హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ముందస్తు రిటైర్‌‌మెంట్‌‌ కోసం తాను ఇచ్చిన దరఖాస్తును ఆమోదించిన తరువాత కూడా ఉద్యోగం నుంచి తొలగించడం రూల్స్‌‌కు వ్యతిరేకమని పిటిషన్‌‌లో పేర్కొన్నారు. కొచర్‌‌ అవినీతికి పాల్పడ్డట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఐసీఐసీఐ బ్యాంకు ఆమెను కొన్ని నెలల క్రితం ఉద్యోగం నుంచి తొలగించింది. 2009 ఏప్రిల్‌‌ నుంచి 2018 మార్చి వరకు ఇచ్చిన బోనస్‌‌లను, స్టాక్‌‌ ఆప్షన్స్‌‌ను వెనక్కి తీసుకుంది. తన ముందస్తు రిటైర్‌‌మెంట్‌‌ దరఖాస్తును ఆమోదించిన తరువాతే సందీప్‌‌ బక్షిని ఐసీఐసీఐ ఎండీ, సీఈఓగా నియమించారని ఆమె కోర్టుకు వివరించింది. గత ఏడాది అక్టోబరులో రిటైర్‌‌మెంట్‌‌ రిక్వెస్ట్‌‌ను ఆమోదించినట్టు తెలిపి, ఈ ఏడాది ఫిబ్రవరిలో టెర్మినేషనల్‌‌ లెటర్‌‌ పంపించారని ఆరోపించారు. తనను టెర్మినేట్‌‌ చేయడం, బోనస్‌‌లను, స్టాక్‌‌ ఆప్షన్స్‌‌ను వెనక్కి తీసుకోవడం రూల్స్‌‌కు వ్యతిరేకమని స్పష్టం చేశారు. కొచర్‌‌ తరఫున న్యాయవాది వాదనలు విన్న న్యాయమూర్తులు రంజిత్‌‌ మోరే, ఎంఎస్‌‌ కార్నిక్‌‌ కేసు తదుపరి విచారణను ఈ నెల రెండో తేదీకి వాయిదా వేశారు.

ఐసీఐసీఐ రూల్స్‌‌కు వ్యతిరేకంగా, తన అధికారాన్ని దుర్వినియోగం చేసి కొచర్‌‌ వీడియోకాన్‌‌ గ్రూపునకు లోన్ ఇచ్చారని ఆరోపణలు రావడం తెలిసిందే. మొదట్లో కొచర్‌‌ను సమర్థించిన బ్యాంకు యజమాన్యం తరువాత విచారణకు ఆదేశించింది. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందాకొచర్ భర్త దీపక్ కొచర్‌‌‌‌కు చెందిన కంపెనీ న్యూపవర్ రెన్యూవబుల్స్‌‌కు, వేణుగోపాల్ ధూత్‌‌కు చెందిన వీడియోకాన్ ఇండస్ట్రీస్‌‌కు మధ్య జరిగిన డీలింగ్స్ విషయంలో విచారణ చేపట్టాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్‌‌ఎఫ్‌‌ఐఓ)ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఆదేశించింది. 2012లో ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.3,250 కోట్ల రుణం జారీ కావడంతో, దానికి ప్రతిఫలంగా దీపక్ సంస్థకు వీడియోకాన్ ఇండస్ట్రీస్‌‌ కోట్ల రూపాయలను ఇచ్చిందని ఆరోపణలున్నాయి.   ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ కూడా విచారణ చేపట్టింది. ఇప్పటికే నిందితులు పలుసార్లు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో భాగంగా దీపక్ కొచర్ సోదరుడు రాజీవ్ కొచర్‌‌‌‌ను కూడా ఈడీ ప్రశ్నించింది. ఈడీ దీనిపై పీఎంఎల్‌‌ఏ కింద క్రిమినల్ కేసు దాఖలు చేసింది. ఈ ఆరోపణలపై నిగ్గుతేల్చడానికి ఏర్పాటైన రిటైర్డ్‌‌ జస్టిస్‌‌ శ్రీకృష్ణ కమిటీ కూడా కొచర్‌‌ బ్యాంకు రూల్స్‌‌ను అతిక్రమించారని నివేదిక ఇచ్చింది.