24 గంటల తర్వాత  హిమాచల్ హైవే ఓపెన్

24 గంటల తర్వాత  హిమాచల్ హైవే ఓపెన్

సిమ్లా: చండీగఢ్–మనాలీ నేషనల్ ​హైవే 24 గంటల తర్వాత మళ్లీ  తెరుచుకుంది. జాతీయ రహదారిపై స్తంభించిపోయిన ట్రాఫిక్​ను  సోమవారం రాత్రి అధికారులు పునరుద్ధరించారు. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో దాదాపు ఒకరోజంతా రాకపోకలు నిలిచిపోయాయి.  దీంతో వందలాదిమంది ప్రయాణికులు, టూరిస్ట్​లు ఆదివారం సాయంత్రం నుంచి హిమాచల్​ప్రదేశ్​లోని మండి జిల్లాలో ట్రాఫిక్​లో చిక్కుకుపోయారు. అనంతరం హైవేను ఓపెన్​ చేసిన అధికారులు ట్రాఫిక్​ను పునరుద్ధరించారు. కాగా, హిమాచల్ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

జూన్ 28, 29 తేదీలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు,  30 వ తేదీ, జులై 1 తేదీలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల కారణం గా రాష్ట్రంలో మొత్తం 116 రోడ్లు మూసివేశారు. 106 పవర్ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.  ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ) ఓంకార్ చంద్ శర్మ మాట్లాడుతూ పర్యాటకులు వారి మొబైల్‌‌‌‌లలో ఐఎండీ యాప్‌‌‌‌ను డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడటంతో సహా వర్షాలకు సంబంధించిన సంఘటనలలో ఇప్పటివరకు 9 మంది మరణించగా, 14 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు.