Golden Globes 2023:పోతరాజు,జొన్న రొట్టెలో మిరప తొక్కు

Golden Globes 2023:పోతరాజు,జొన్న రొట్టెలో మిరప తొక్కు

నాటు నాటు పాట..ఇది తెలంగాణ పదాల పాట...పల్లె మాటల మూట. మొత్తంగా ఇది తెలంగాణ మాస్ మాటల మ్యాజిక్..ఈ మ్యూజిక్. రాసింది తెలంగాణోడు. పాడింది తెలంగాణోడు. నాటు నాటు..ఎల్లలు దాటి...అందరి చేత కాలు కదిపేలా చేసింది. అంతర్జాతీయ వేదికపై దుమ్మురేపి  అవార్డును అందుకుంది. 

నాటు నాటు పాటను రాసింది చంద్రబోస్. చంద్రబోస్ స్వస్థలం వరంగల్ జిల్లా, చిట్యాల మండలం, చల్లగరిగె అనే కుగ్రామం. ఆ  గ్రామంలో అప్పుడప్పుడూ ఒగ్గు కథలు, చిందు భాగవతాలు, నాటకాలు వేసేవారు. తల్లితో కలిసి వాటిని చూసి చంద్రబోస్ పద్యాలు, పాటలపై ఆసక్తి పెంచుకున్నాడు. తెలంగాణ యాసను నరనరాల్లో ఇంకించుకున్నాడు. తాజ్ మహల్ సినిమా ద్వారా సినీ రంగప్రవేశం చేసిన ఆయన..ఇప్పటి వరకు వేల పాటలు రాశాడు. కానీ ఏ పాట కూడా అంతర్జాతీయ వేదికపై అవార్డును తీసుకురాలేదు. కానీ మనసు పెట్టి..మన యాసను భాషను కలంతో కరగబెట్టి నాటు నాటు పాటను రాశాడు. 

ఒక్కసారి లిరిక్స్ ను గమనిస్తే..

పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు...పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
కిర్రు సెప్పులేసుకుని కర్రసాము సేసినట్టు..మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన ..మిరప తొక్కు కలిపినట్టు

పొలం..జాతర, పోతరాజు, మర్రిసెట్టు, గుంపు, ఎర్రజోన్న రొట్టె, మిరపతొక్కు. ఈ పదాలన్నీ తెలంగాణ ప్రజల జీవనం... జీవితం..పొద్దున లేచినప్పటి నుంచి..పొద్దుపోయి పడుకునే దాకా..తెలంగాణ జనం మాట్లాడుకునే మాటలివి. అందుకే జనాలకు నచ్చాయి. జనాల గుండెల్లో  నిలిచాయి.   


పచ్చి మిరప లాగ పిచ్చ నాటు..విచ్చు కత్తి లాగ వెర్రి నాటు
గుండెలదిరిపోయేలా ..డండనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలా ,,కీసు పిట్ట కూసినట్టు
ఏలు సిటికెలేసేలా..యవ్వారం సాగినట్టు
కాలు సిందు తొక్కేలా..దుమారం రేగినట్టు
ఒల్లు సెమటపట్టేలా..వీరంగం సేసినట్టు

నాటు నాటు గడ్డపార లాగ చెడ్డ నాటు
నాటు నాటు ఉక్కపోత లాగ తిక్క నాటు
భూమి దద్దరిల్లేలా..వొంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా
ఏసేయరో యకాయకి ..నాటు నాటు నాటో
దుమ్ము దుమ్ము దులిపేలా..లోపలున్న పానమంతా
దుముకు దుముకులాడేలా..దూకేయరో సరాసరి

పచ్చి మిరప, సెవులు, కీసు పిట్ట, ఏలు సిటికెలేయడం, ఒల్లు సెమటపట్టేయడం, గడ్డ పార, ఉక్కపోత వంటి పదాలు ..తెలంగాణ ప్రజల శ్రమను తెలియజేస్తున్నాయి. మన కష్టాన్ని కళ్లకు కడుతున్నాయి. 


పదాలు రాస్తే సరిపోదు..వాటికి ప్రాణం పోసే శక్తి పాటగాడికే ఉంది. అందుకే ఈ నాటు నాటు పాటను పాడింది తెలంగాణ పిల్లగాడే. అతనే రాహుల్ సిప్లిగంజ్. గల్లీ నుంచి వచ్చిన ఇతను నాటు నాటకు తన గొంతుతో మరింత కిక్కెక్కించాడు. తన మాస్ గాత్రంతో జనాన్ని ఉర్రూతలూగించాడు. తెలుగు, హిందీతో పాటు అన్నీ భాషల్లో పాడిన రాహల్..నాటు నాటుతో అసలు సిసలైన మజాను అందించాడు.  రాహుల్ తో పాటు..కాలబైరవ కూడా గాత్రాన్ని అందించాడు. పాట సూపర్ హిట్ కావడంలో కీలక పాత్ర పోషించాడు.