ఈ ఏడాదిలో ఇదే చివరి గ్రహణం

ఈ ఏడాదిలో ఇదే చివరి గ్రహణం

ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ ఏడాది చివరి గ్రహణం ఇదే. మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాలకు గ్రహణం మొదలైంది. సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు గ్రహణం కొనసాగుతుంది. ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లోనే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కొన్ని నగరాల్లో చంద్రగ్రహణం సంపూర్ణంగా కనిపించినా.. హైదరాబాద్ లో మాత్రం పాక్షికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం పాక్షికమే అని ప్లానెటరీ సొసైటీ డైరెక్టర్ రఘునందన్ అన్నారు. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు రాష్ట్రాల్లోనే కొద్దిసేపు సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుందన్నారు. మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రాత్రి 7 గంటల 28 నిమిషాల వరకు గ్రహణం కాలం ఉంటుందన్నారు. కంటికి కనిపించే గ్రహణం మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు ఉంటుందన్నారు. సాయంత్రం పూట గ్రహణం కనిపిస్తుందని చెప్పారు. 

సాయంత్రం సమయంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గ్రహణం కనిపించనుంది. కోల్ కతా, గౌహతిలో చంద్రగ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుంది. ఈ ఫుల్ ల్యూనార్ ఎక్లిప్స్ తెలుగు రాష్ట్రాల్లో 5 గంటల 40 నిమిషాల నుంచి 6 గంటల 19 నిమిషాలకు చంద్రగ్రహణం కనిపించనుంది. కోల్ కతాలో గంట 27 నిమిషాలు.. గౌహతిలో గంట 45 నిమిషాలు చంద్రగ్రహణాన్ని చూడవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంతో పాటు పసిఫిక్ మహాసముద్రాలను కవర్ చేసే ప్రాంతంలో చంద్రగ్రహణం కనిపించనుంది. 2023 అక్టోబర్ 28న మరోసారి చంద్రగ్రహణం ఏర్పడనుంది. కాగా, గ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ మూతపడ్డాయి.