కొద్దివారాలుగా అకస్మాత్తుగా తెరమీదికి వచ్చిన చట్టసభల్లో మహిళా కోటా అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిరోజూ మాట్లాడుతూ వచ్చారు. ఆయనతో పాటు ఇతర నేతల మాటతీరు చూస్తుంటే ఎవరికీ మహిళా కోటా పట్టనట్లుగా మోదీ ఒక్కరికే పట్టినట్లుగా భ్రమ పడే ప్రమాదం ఉంది. నిజానికి మహిళలకు చట్టసభల్లో కోటా ఇవ్వడానికి మేం వ్యతిరేకం అని ఎవరూ చెప్పలేదు. చెప్పే ఆస్కారం కూడా లేదు. అయితే ‘2024 ఎన్నికల ముందు’ 2023లోనే ఏకగ్రీవంగా పాసైన మహిళా కోటా చట్టం ఇప్పుడు ‘5 రాష్ట్రాల ఎన్నికల ముందు’ హడావుడిగా ఎందుకు ఎజెండా అయ్యిందన్నదే ఆలోచించాల్సిన ప్రశ్న.
2023లోనూ అప్పటికి పదేండ్లుగా పట్టించుకోని మహిళా కోటా బిల్లును కేంద్ర ప్రభుత్వం.. ఏడాదిలోపు ఎన్నికలు ఉండగా మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి తెచ్చారన్న చర్చ జరిగింది. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతిచ్చాయి. కానీ అప్పటి నుంచే మహిళా కోటాను అమలు చేయాలన్న విపక్షాల డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోలేదు. అప్పట్లో కేంద్ర పెద్దలు చెప్పిన కారణం రాజ్యాంగ నిబంధన.. 2026 తర్వాత జరిగే కొత్త జనగణన ఆధారంగానే డీలిమిటేషన్ జరగాలని గతంలో పెట్టిన నిబంధన అది. మహిళా కోటా ఇవ్వడానికి డీలిమిటేషన్‌తో ఏ సంబంధం లేకున్నా, సీట్లు పెరిగితేనే మహిళలకు కోటా ఇవ్వాలనే భావననే కేంద్రం చూపించింది. మహిళలకు కోటా ఇచ్చినా పురుషులకు మాత్రం సీట్లు తగ్గకూడదన్న ఉద్దేశం కావచ్చు.
మూడేండ్ల నుంచి మాట్లాడని ప్రధానికి 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఎందుకు గుర్తొచ్చింది!
మొత్తంగా ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో మూడు వేర్వేరు విషయాలు కలగలిసిపోయాయి. అన్నీ కలిపేసి రాజకీయ గందరగోళం చేయడమే అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది. మొదటిది, మహిళా కోటా అంశం. గతంలో ఎన్నికలకు ఏడాది ముందు కోటా చట్టం తెచ్చిన కేంద్రం ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలకు నెల రోజుల ముందు నిద్రలేచింది.
చట్టం చేస్తున్నప్పుడు అప్పటి నుంచే అమలుకు ఒప్పుకోని పెద్దలు మూడేండ్లలో ఏనాడూ దాని గురించి మాట్లాడలేదు. కోటా అమలుపై ఏనాడూ పార్లమెంట్లోగానీ, బయటగానీ మాట్లాడని ప్రధాని మోదీ నేరుగా రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలోనే ఈ అంశాలపై మాట్లాడడం మొదలుపెట్టారు. మహిళా కోటాను గుర్తుతెలియని వాళ్లెవరో వ్యతిరేకిస్తున్నట్లుగా, ఆయనొక్కరే నచ్చజెబుతున్నట్లుగా ఆయన తీరు ఉంది.
డీలిమిటేషన్ జరిగితే మాత్రమే.. మహిళా కోటా ?
రెండోది, మహిళా కోటాకు ఏ సంబంధం లేకున్నా డీలిమిటేషన్లో 50 శాతం సీట్లు పెంచుతామని కొత్త బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. అసలు జనగణనే పూర్తి కాకున్నా 50 శాతం పెంచాలన్న ప్రతిపాదనకు ప్రాతిపదిక ఏంటి? దీనికీ పాత జనాభా లెక్కలే చెబుతున్నారు. చాలా విషయాల్లాగే ఇట్లాంటివి ప్రజలకు స్పష్టంగా చెప్పే అలవాటు కేంద్ర పెద్దలకు ఎప్పుడూ లేదు. 2011 నాటి జనగణన ఆధారంగానే డీలిమిటేషన్ చేయబోతున్నట్లు కొత్త బిల్లులో పరోక్షంగా తేల్చిచెప్పేశారు. దీనికి తగినట్లుగా సీట్ల పెంపు జరగకుంటే మహిళలకు కోటా రానేరాదన్నట్లుగా కేంద్రమంత్రులు కూడా మాట్లాడుతున్నారు. మహిళలకు కోటా ఇచ్చే విషయంలో వాళ్ల చిత్తశుద్ధి ఇదే కావచ్చు. మూడో అంశం, జనగణన. ప్రతి పదేండ్లకు జనగణన చేయడం కచ్చితంగా జరగాల్సిన ప్రక్రియ.
2011 తర్వాత 2021లో జరగాల్సిన జనగణనను కొవిడ్ కారణం చూపిస్తూ కేంద్రం వాయిదా వేసింది. కొవిడ్ సమస్య తీరిన మరుసటి ఏడాదిలోనైనా(2024) జనగణన జరిపిఉండాలి. కానీ కొవిడ్ ముసుగునే చూపిస్తూ ఏటా జనగణనకు బడ్జెట్లో నిధులు కూడా కేటాయించకుండా కేంద్రం పనిగట్టుకొని వాయిదావేసింది. రాజకీయ విమర్శలు ఎట్లా ఉన్నా ప్లాన్ ప్రకారమే జనగణన ఆపారన్నది ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. తీరిగ్గా కేంద్రం జనగణన ప్రక్రియను 2026లో మొదలు
పెట్టింది. ఇది 2027లో మార్చి చివరికి పూర్తవుతుంది. అంటే సరిగ్గా 11 నెలల్లో పూర్తికాబోతున్న జనగణనకు ఇప్పుడు ఏ ప్రాధాన్యం లేకుండాపోయింది.
దక్షిణాది అభిప్రాయాలతో కొత్త ఫార్ములాకు వీలు లేదా!
జనగణన జరిగితేనే దేశ జనాభా ఎంత పెరిగింది, వారి స్థితిగతులు తెలుస్తాయి. కేంద్రం నిజంగానే చిత్తశుద్ధితో కులగణన కూడా చేస్తే కులాలవారీగా జనాభా లెక్కలు, వారి స్థితిగతులు దేశానికి తెలుస్తాయి. దీని ఆధారంగా దేశంలో మొత్తంగా ఎన్ని సీట్లు పెంచుకోవాలన్నది తెలుస్తుంది. అందులో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు చెబుతున్న ఆందోళనలను, వాటి అభిప్రాయాలను తెలుసుకొని కొత్త ఫార్ములాను రూపొందించుకునే వీలుంటుంది.
జనాభా నియంత్రణలో ముందుండి, అభివృద్ధిలో దేశానికి అండగా ఉంటున్నందుకు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగడం దేశానికి మంచిది కాదు. ఒకరకంగా ఉత్తరాదిలో ఆర్థిక వెనుకబాటుతనంలో ఉన్న రాష్ట్రాలకు మహా రాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి అందుతున్న పన్నుల నిధులే ఆధారం. దేశాన్ని నడిపించడంలో ఇంత కీలకంగా ఉన్న రాష్ట్రాలకు దేశ పాలనలో సరైన భాగస్వామ్యం లేకుండా చేయడం కొత్త సంక్షోభాలకు దారితీసే ప్రమాదముంది.
ఓబీసీ కోటాపై స్పష్టత లేదు
మరోవైపు కులగణన ఆధారంగా మాకు చట్టసభల్లో తగిన వాటా కావాలని చాలాకాలంగా దేశంలో ఓబీసీ వర్గాలు కోరుతున్నాయి. మన రాష్ట్రానికి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్యతోపాటు అనేక బీసీ సంఘాలు ఈ ఉద్యమంలో ముందున్నారు. అయినా బీసీ కోటా పెంపు గురించిగానీ, చట్టసభల్లో కోటా గురించికానీ ఇప్పటివరకు ఏనాడూ కేంద్ర పెద్దలు బహిరంగ ప్రకటన చేయలేదు.
కుల గణన విషయంలోనూ మొదటి నుంచీ బీజేపీ విధానపరంగా వ్యతిరేకంగా ఉన్నా.. చివరికి జనగణనలో కులగణన చేస్తామని కేంద్రం ఒప్పుకుంది. అది కూడా సాకారమైతే కచ్చితంగా బీసీ వర్గాలకు చట్టసభల్లో కోటా కల్పించడం అనివార్యం అవుతుంది. కాబట్టే, జరగబోయే జనగణనకు, కులగణనకు సంబంధం లేకుండానే 2011జనాభా ఆధారంగా మాత్రమే డీలిమిటేషన్ చేస్తున్నారనే ఆరోపణ బలంగా వినిపిస్తున్నది. అట్లాగే 2011 నుంచి పెరిగిన ఎస్సీ, ఎస్టీ జనాభా ఆధారంగా వారి సీట్లను కూడా పెంచుకోవడం తప్పనిసరి. ఇంత ప్రాధాన్యం ఉన్న జనగణనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వకపోవడం సరికాదు.
చంద్రబాబు, పవన్లదే బాధ్యత
డీలిమిటేషన్ విషయంలో వస్తున్న ఆందోళనలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇటు తెలంగాణ, తమిళనాడు సీఎంలు రేవంత్ రెడ్డి, స్టాలిన్ ఈ అంశంపై బలంగా దక్షిణాది వాదనను వినిపిస్తున్నారు. అయితే విచిత్రంగా గతంలో సౌత్పై వివక్ష గురించి బలంగా మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పుడు మాట్లాడడం లేదు. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యంతోపాటు ప్రభావితం చేయగలిగే అవకాశం ఉన్న ఈ ఇద్దరు నేతలు చొరవ తీసుకోవాల్సిన సమయం కూడా ఇదే. దక్షిణాదికి అన్యాయం జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత వారి మీద ఉంది.
ఒకవేళ ఇప్పుడు కేంద్రం చేస్తున్నదే సరైందని వారు భావిస్తే, ఏ విధంగా న్యాయం జరుగుతుందో దక్షిణాది రాష్ట్రాలకు వివరించాల్సిన నైతిక బాధ్యత కూడా వారే తీసుకుంటే వారి గౌరవం పెరుగుతుంది. జనగణన పూర్తికాకుండా జరిగే డీలిమిటేషన్‌కు ఏరకమైన శాస్త్రీయత ఉంటుందన్నది తెలియంది కాదు. పార్లమెంట్లో చర్చ తర్వాత అయినా కేంద్రం డీలిమిటేషన్ ప్రతిపాదన పక్కనబెట్టి, పూర్తిగా మహిళా కోటా చట్టం అమలుకు పరిమితమైతే ఇటు మహిళలకు న్యాయంతోపాటు, కొత్త సంక్షోభాలకు అవకాశం ఇవ్వకుండా ఉన్నట్లవుతుంది. అది మంచి రాజకీయాలకు ఆదర్శంగా నిలిచే అవకాశమూ ఉంటుంది.
దక్షిణాది ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవాలి
దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను గుర్తించి గతంలో ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ నుంచి అటల్ బిహారీ వాజ్‌పేయి వరకు సీట్ల పెంపు ఆలోచనను పక్కనబెట్టారు. కొత్త సమస్యలు సృష్టించడం కంటే దేశ ప్రయోజనాన్నే వారు కోరుకున్నారు. పాత సంఖ్యతోనే పునర్విభజన కొనసాగించారు.
కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ఆలోచనలను పరిశీలించాకే డీలిమిటేషన్‌పై ముందుకుపోవాల్సిన అవసరం ఉంది. చివరిగా, మహిళా రిజర్వేషన్ల అమలు 2029 ఎన్నికల నుంచే ఎందుకు? బిల్లు పాసయిన తర్వాత వచ్చే ప్రతి ఎన్నికల్లోనూ మహిళా కోటా అమలు
చేయడానికి కేంద్రానికి ఉన్న ఇబ్బంది ఏమిటో అర్థంకాని విషయం.
మురళి, జర్నలిస్ట్
* ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
* రచన 700 పదాలకు మించరాదు.

