IPL 2026 Final: ఐపీఎల్ 2026 సీజన్ మహా సంగ్రామానికి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం సర్వం సిద్ధమైంది. నేడు జరగబోయే అత్యంత ఉత్కంఠభరితమైన ఫైనల్ ఫైట్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. స్టేడియంలో ట్రోఫీ కోసం ఈ రెండు జట్లు కొట్లాడుకుంటుంటే, వ్యాపార ప్రపంచంలో మాత్రం ఒకే ఒక్క సంస్థ విజయోత్సవాలకు రెడీ అవుతుంది.
ట్రోఫీ ఎవరు గెలిచిన.. కోట్ల ఆదాయం ఆ గ్రూప్‌దే:
స్టేడియంలో ఏ జట్టు గెలిచినా.. కప్పు ఏ నగరానికి వెళ్లినా, ఈ ఫైనల్ మ్యాచ్ ద్వారా వ్యాపారంలో అసలైన విజేతగా ఆదిత్య బిర్లా గ్రూప్ నిలవబోతుందని సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. బిజినెస్ లో ఆదిత్య బిర్లా గ్రూప్ ఎంతటి ప్రణాళిక వేసిందో ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ స్పష్టం చేస్తోంది. ఈ లీగ్‌లో ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘బిర్లా ఎస్టేట్స్’ గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా కొనసాగుతుంది. ఈ ఒప్పందంలో భాగంగా గుజరాత్ ప్లేయర్స్ జెర్సీలపై అందరికీ స్పష్టంగా కనిపించేలా ‘బిర్లా ఎస్టేట్స్’ పెద్ద లోగో మనకి కనిపిస్తుంది.
మరోవైపు, ఆర్సీబీ యాజమాన్యంలో కూడా బిర్లా గ్రూప్ భాగస్వామిగా ఉంది. దాదాపు రూ. 16 వేల కోట్లకు పైగా భారీ వ్యయంతో మరో ముగ్గురు భాగస్వాములతో కలిసి బిర్లా గ్రూప్ ఈ ఫ్రాంచైజీని దక్కించుకుంది. ఒకవైపు ఫైనల్ ఆడుతున్న ఆర్సీబీ జట్టులో యాజమాన్య భాగస్వామ్యం, మరోవైపు ప్రత్యర్థిగా తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రధాన స్పాన్సర్‌షిప్.. ఇలా రెండు జట్లతోనూ బిర్లా గ్రూప్‌కు విడదీయరాని ఆర్థిక అనుబంధం ఉంది.
విజేత బిర్లా గ్రూపే:
ఈ ఆసక్తికరమైన సమీకరణాలతో నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్ తో రచ్చ చేస్తున్నారు. ఆర్సీబీ గెలిచినా, గుజరాత్ టైటాన్స్ గెలిచినా అంతిమంగా లభించే భారీ లాభం, బ్రాండ్ గుర్తింపు ఆదిత్య బిర్లా గ్రూప్‌కే లభిస్తుందని క్రీడా పండితులు సైతం పేర్కొంటున్నారు. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా బిర్లా బ్రాండ్ విలువ అంతర్జాతీయ స్థాయిలో వినిపించడం ఖాయం.
