
అమరావతి, వెలుగు: “నన్నే అడ్డుకుంటారా.. మీకెంత ధైర్యం? ఏం తమాషా చేస్తున్నారా? చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి” అంటూ ఏపీ పోలీసులపై మాజీ సీఎం, టీడీపీ చీఫ్ ఫైర్ అయ్యారు. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఆదివారం మంగళగిరి నుంచి నరసరావుపేట వరకు టీడీపీ బైక్ ర్యాలీ చేపట్టింది. బైక్ ర్యాలీకి పర్మిషన్ లేదన్న పోలీసులు.. బైక్ ల తాళాలు లాక్కున్నారు. దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీ సీఎంను నమ్మిన ఐఏఎస్ అధికారులే జైలుకెళ్లారు. పోలీసులు ఆ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ప్రతిపక్షాలు చేసే ప్రతిపనికి అడ్డుపడటం పోలీసులకు ఫ్యాషన్ అయిపోయింది. నిబంధనల పేరుతో ప్రజా ఉద్యమాలను అణిచేయాలని చూస్తే ప్రజలే తిరగబడతారు జాగ్రత్త” అని హెచ్చరించారు. దీంతో వెనక్కి తగ్గిన పోలీసులు టీడీపీ కార్యకర్తలు, నాయకులకు బైక్ ల తాళాలు ఇచ్చేశారు. తాను కాన్వాయ్ లో వెళితే మళ్లీ ర్యాలీని అడ్డుకుంటారని అనుమానించిన చంద్రబాబు బైక్ ఎక్కి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతి తరలింపును రాష్ర్టంలోని అన్ని ప్రాంతాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. టీడీపీపై కోపంతో సీఎం జగన్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం జగన్ రాజధాని తరలింపు నిర్ణయం మార్చుకోవాలని కోరారు. అమరావతిలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం భావిస్తే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. బైక్ ర్యాలీ ప్రారంభానికి ముందు పోలీసుల లాఠీచార్జ్ లో గాయపడిన రాజధాని మహిళా రైతులను చంద్రబాబు పరామర్శించారు.