డోంట్ వర్రీ : చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు : రవికిరణ్

డోంట్ వర్రీ : చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు : రవికిరణ్

చంద్రబాబు ఆరోగ్య, భద్రత విషయంలో అప్రమత్తంగా ఉంటూ అన్ని చర్యలు తీసుకుంటున్నామని కోస్తా జిల్లాల జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు అంశాలను వివరించారు.  చంద్రబాబుకు సంబంధించి భద్రత విషయంలో ఎటువంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. మొదటి నుంచి హైప్రొఫైల్ ఖైదీకి ఇచ్చే అన్ని సౌకర్యాలు చంద్రబాబుకు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఆయనకువచ్చే ఆహారం, ఇతర అంశాలను తనిఖీ చేసేందుకు ఒక జైలర్ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించామన్నారు. బయట నుంచి వచ్చిన భోజనాన్ని పరీక్షించి మరీ లోపలికి పంపుతున్నామని స్పష్టం చేశారు. ఎస్పీ సలహా, సూచనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన అన్ని ఏర్పాట్లు  చేస్తున్నామన్నారు.

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని రవికిరణ్ వెల్లడించారు. జైలులో ఉన్న వైద్యాధికారులు రోజుకు మూడుసార్లు ఆయనకు వైద్యపరీక్షలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు జైల్లోకి వచ్చినప్పుడు 66 కేజీలు ఉండగా, ప్రస్తుతం  67 కేజీల బరువుకు చేరుకున్నారని వివరించారు. చంద్రబాబు బరువు తగ్గారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. చంద్రబాబు రోజూ వినియోగిస్తున్న మందులనే వాడుతున్నారన్నారు.   నిబంధనల ప్రకారం చంద్రబాబుకు ఏసీ, కూలర్స్ ఇవ్వలేమన్నారు. ఏసీ వసతి జైళ్ల మ్యాన్యువల్ లో లేదని తెలిపారు.  దోమ తెర ఇచ్చామన్నారు. కోర్టు నుంచి ఏం ఆర్డర్స్ వస్తే వాటి ప్రకారం నడుచుకుంటామన్నారు. చంద్రబాబు దగ్గరకు వేరే ఏ ఖైదీని అనుమతించడం లేదని డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు.