మోదీజీ.. మమ్మల్ని జర సూడుండ్రి

మోదీజీ.. మమ్మల్ని జర సూడుండ్రి
  • తమ రాష్ట్రాలకు బడ్జెట్​ నుంచి రూ.50 వేల కోట్లు ఆశిస్తున్న బాబు, నితీశ్​

న్యూఢిల్లీ: ఈసారి బడ్జెట్​ మోదీ ప్రభుత్వానికి నల్లేరు మీద నడక కాకపోవచ్చు. ఆయన ప్రభుత్వంలో కీలక భాగస్వాములైన టీడీపీ చీఫ్​ చంద్రబాబు నాయుడు, జేడీయూ బాస్​ నితీశ్​ నుంచి ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. ఈ ఇద్దరు నాయకుల నుంచి ఇది వరకే పలు డిమాండ్లు వచ్చాయి. ఎందుకంటే బీహార్,  ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి ప్రాజెక్టులపై ఖర్చు చేసే సామర్థ్యం తగ్గింది.

  జీతాలు, పెన్షన్లు  వడ్డీ చెల్లింపుల కోసం బీహార్ ఖర్చు రాష్ట్ర  ఆదాయంలో 40శాతం కంటే ఎక్కువగా ఉంటోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం సుమారు 59 వేల రూపాయలు మాత్రమే. జాతీయ సగటు కంటే  కంటే తక్కువ. రాయిటర్స్ వార్తాసంస్థ రిపోర్ట్​ ప్రకారం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న సమర్పించనున్న బడ్జెట్ నుంచి చంద్రబాబు నాయుడు,  నితీష్ కుమార్ తమ రాష్ట్రాలకు సుమారు రూ.50 వేల కోట్లు డిమాండ్ చేశారు. 

ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు సాధించింది. మెజారిటీ తగ్గింది. ప్రధాన మిత్రులైన చంద్రబాబు నాయుడు, నితీష్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌ల సహకారంతో ఎన్‌‌‌‌డీఏ ప్రభుత్వం ఏర్పడింది. టీడీపీ, జేడీయూకు కలిసి 28 సీట్లు ఉన్నాయి.  కేంద్రం అందించే మూలధన వ్యయం కోసం రూ. లక్ష కోట్ల వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాలను దాదాపు రెట్టింపు చేయాలని ఈ రాష్ట్రాలు కోరాయి. గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే 2024-–25లో సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌‌‌‌లో మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం కోసం కేంద్రం రూ.1.3 లక్షల కోట్లను కేటాయించింది.

 మార్కెట్ నుంచి కూడా అప్పులు తీసుకోవడానికి రాష్ట్రాలు సడలింపులను కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రుణ పరిమితిని రాష్ట్ర ఆదాయం లేదా స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్​డీపీ)లో మూడు శాతానికి పరిమితం చేసింది. బీహార్ ప్రత్యేకంగా తొమ్మిది కొత్త విమానాశ్రయాలు, రెండు పవర్ ప్రాజెక్టులు, రెండు నదీ జలాల కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని కోరింది. ప్రత్యేక హోదానూ డిమాండ్​ చేస్తోంది. నిధులను పంపిణీ చేయడానికి నిర్దిష్ట కాలపరిమితి లేకుండా ఏడు వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని కోరింది. 

చంద్రబాబు డిమాండ్లు ఇవి...

అమరావతి అభివృద్ధికి,  నీటిపారుదల, మౌలిక సదుపాయాల కోసం ఆంధ్రప్రదేశ్ నిధులు డిమాండ్ చేసింది. గతంలో ఆంధ్రాకు ప్రత్యేక రాష్ట్ర హోదా కోరిన చంద్రబాబు, ఈసారి అంతకుమించిన సాయం కావాలని కోరారు.  ఇటీవల ఆయన ప్రధానిని కలిసి డిమాండ్లను ముందుంచారు. బుందేల్​ఖండ్​ మాదిరే తమకూ వెనుకబడ్డ రాష్ట్రాలకు ఇచ్చే ఆర్థికసాయం అందించాలని కోరారు. రాష్ట్ర జీడీపీలో ఆర్థికలోటు పరిమితిని మూడు శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని రిక్వెస్ట్​ చేశారు. అప్పులు తీర్చడానికి రాబోయే ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.