గుంటూరు: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఆదివారం సాయంత్రం గుంటూరులో జరిగిన సభలో జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు మహిళల పరిస్థితి సీరియస్గా ఉంది. న్యూఇయర్ సందర్భంగా ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనతా వస్త్రాలు, చంద్రన్న కానుకలు పంపిణీ చేస్తామంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున మహిళలను, వృద్ధులను సభకు తరలించారు.
..ముగ్గురు మహిళలు మృతి
సభలో ముందుగా చంద్రబాబు మాట్లాడి వెళ్లిపోయారు. ఆ వెంటనే కానుకల పంపిణీ ప్రారంభించడంతో జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఒక మహిళ ఘటనాస్థలంలోనే చనిపోగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, 4రోజుల కిందటే నెల్లూరు జిల్లా కందుకూరులో బాబు రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలోనూ 8 మంది చనిపోయారు. ఆ ఘటన మరువకముందే మరోసారి ఇలాంటి విషాదం చోటుచేసుకోవడంతో నిర్వాహకుల పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.