చంద్రయాన్-2… మూన్ పైకి ఎలా వెళ్తుందో తెలుసుకోండి

చంద్రయాన్-2… మూన్ పైకి ఎలా వెళ్తుందో తెలుసుకోండి

చంద్రయాన్–2 మిషన్ ప్రయోగం వారం రోజులు వాయిదా పడింది. కానీ చంద్రుడిపై మన ల్యాండర్ దిగే రోజును మాత్రం ఇస్రో మార్చలేదు. సెప్టెంబర్​ 7నే ఫిక్స్​ చేసింది. 6 నుంచి 8వ తేదీ మధ్య దానిని చంద్రుడి మీద దింపేందుకు ప్రయత్నిస్తుంది. 48 రోజుల ప్రయాణంలో 9 దశల్లో చంద్రయాన్​2ను చంద్రుడి మీద దింపుతుంది. 

చంద్రయాన్–2  తొమ్మిది దశలను ఒక్కొక్కటిగా దాటుతూ చంద్రుడి మీద దిగాలి. ప్రయోగం జరిగిన రోజు నుంచి 23 రోజుల పాటు భూ కక్ష్యలో తిరుగుతుంది. ఆ తర్వాత 24వ రోజున చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్​ 2 గమనాన్ని మారుస్తారు. ఆ రోజు నుంచి 30వ రోజు వరకు ఏడు రోజుల పాటు దాని కక్ష్యను మారుస్తూ చంద్రుడి లైన్​లోకి పంపిస్తారు. 30వ రోజున పూర్తిగా చంద్రుడి కక్ష్యలోకి నెడతారు. ఆ రోజు నుంచి 42వ రోజు వరకు అంటే 13 రోజుల పాటు చంద్రుడి కక్ష్యలోనే చంద్రయాన్​ 2 చక్కర్లు కొడుతుంది. 43వ రోజున ఆర్బిటర్​, ల్యాండర్​లు వేరవుతాయి. 44వ రోజున ల్యాండర్​ను డీబూస్ట్​ చేస్తారు. అంటే దాని ఇంజన్​ను ఆపేయడం. 48వ రోజున విక్రమ్​ ల్యాండర్​ను చంద్రుడి మీద సాఫీగా దింపేందుకు ప్రయత్నిస్తారు.

అంత ఈజీ కాదు

టీఎల్​ఐబీతో చంద్రయాన్​2కు ఇంజన్లను మండించి, దాన్ని ముందుకు తీసుకెళ్లడం అంత సులువైన పనేమీ కాదు. ఈ సమయంలో భూమి, చంద్రయాన్​ 2 ప్రయాణిస్తున్న కక్ష్య దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుంటాయి. అప్పుడు చంద్రయాన్​ 2, భూమి మధ్య ఉండే దూరం, చంద్రుడి కక్ష్య వ్యాసారానికి దాదాపుగా సమానంగా ఉంటుంది. ఇలాంటి టైంలో టీఎల్​ఐబీతో ఇంజన్లను మండించి చంద్రయాన్​2ను చంద్రుడి కక్ష్యలోకి పంపడమంటే కత్తిమీద సాము లాంటిదే. దూరాన్ని కరెక్టుగా లెక్కగట్టి, దానికి తగ్గట్టుగా ఇంజన్లను మండించాలి. అంతేకాకుండా ముందుగా నిర్దేశించుకున్న దిశను చంద్రయాన్​ 2 మిస్​ కాకుండా చూసుకోవాలి. ఈ రెండింటిలో ఏ తప్పు దొర్లినా అది ప్రయాణించే మార్గం మారిపోతుంది.  23 నుంచి 30వ రోజు మధ్య చంద్రయాన్​ 2, భూమి, చంద్రుల మధ్య ఉన్న దూరాన్ని దాటే పనిలో ఉంటుంది. ఈ దశను లూనార్​ ట్రాన్స్​ఫర్​ ట్రాజెక్టరీ(ఎల్టీటీ) అంటారు. దాన్ని దాటేందుకే మిగిలిన నాలుగు టీఎల్​ఐబీలను సైంటిస్టులు వాడతారు. 

జర్నీ జరిగేదిలా..

23 రోజుల పాటు ఆర్బిటార్​, ల్యాండర్​, రోవర్​ ఉన్న 3,850 కిలోల చంద్రయాన్​2  భూ కక్ష్యలోనే ప్రయాణిస్తుంది. ఈ సమయంలోనే భూమి గురుత్వాకర్షణ శక్తి నుంచి దాన్ని తప్పించేందుకు సైంటిస్టులు ‘ఎర్త్ పార్కింగ్ ఆర్బిట్​’ లోకి పంపుతారు. ఆ తర్వాత తొలిసారిగా ‘ట్రాన్స్​ లూనార్​ ఇంజెక్షన్​ బర్న్​’(టీఎల్​ఐబీ)కు గురి చేస్తారు. అంటే థ్రస్టర్లను వాడుతూ చంద్రుడి కక్ష్యలోకి నెట్టే ప్రయత్నం. ఫలితంగా ప్రయాణించే వేగం పెరిగి, చంద్రుడి వైపుగా ప్రయాణించడం మొదలుపెడుతుంది. చంద్రుడిని చేరే లోపు మరో నాలుగు సార్లు టీఎల్​ఐబీకి గురిచేస్తారు.

విక్రమ్విడిపోయేది 43వ రోజు
జాబిల్లి ఆర్బిట్ లోకి వెళ్లిన చంద్రయాన్​ 2, చంద్రుడి నేల వైపు వెళుతూ సమాచారాన్ని ఇస్రోకు పంపిస్తుంటుంది. అలా 13 రోజుల పాటు ప్రయాణం సాగుతుంది. ఆ మరుసటి రోజు అంటే 43వ రోజున ఆర్బిటార్​, ల్యాండర్​ విక్రమ్​ను ఇస్రో సైంటిస్టులు వేరు చేస్తారు. ఆర్బిటార్​, ల్యాండర్​ను వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెడతారు. ల్యాండర్​ విక్రమ్​ 48వ రోజు వరకూ అలానే కక్ష్యలో ఉంటుంది. 48వ రోజు రాత్రి విక్రమ్​ను కక్ష్య నుంచి తప్పించి 15 నిమిషాల్లో చంద్రుడిపై దింపుతారు.