చంద్రుడిపై లొకేషన్ మార్కర్ గా ‘విక్రమ్’

చంద్రుడిపై లొకేషన్ మార్కర్ గా ‘విక్రమ్’
  • మన ల్యాండర్ పైకి నాసా లేజర్ ప్రయోగం
  • విజయవంతంగా కాంతిని వెనక్కి పంపిన రిఫ్లెక్టర్
  • చంద్రుడిపై కచ్చితమైన లొకేషన్ గుర్తించే టెక్నాలజీ సక్సెస్

చంద్రయాన్- 3 మిషన్​లో భాగంగా పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై లొకేషన్ మార్కర్​గా పని చేయడం మొదలుపెట్టిందని ఇస్రో వెల్లడించింది.

బెంగళూరు/వాషింగ్టన్: చంద్రయాన్ 3 మిషన్ లో భాగంగా పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై లొకేషన్ మార్కర్ గా పని చేయడం మొదలుపెట్టిందని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) వెల్లడించింది. విక్రమ్ ల్యాండర్ పై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అమర్చి పంపిన లేజర్ రిట్రోరిఫ్లెక్టర్ అర్రే (ఎల్ఆర్ఏ) పరికరం విజయవంతంగా పని చేస్తోందని తెలిపింది. నాసాకు చెందిన లూనార్ రికన్నాయ్ సెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ) మూన్ ఆర్బిట్ లో తిరుగుతూ ఇటీవల100 కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ కాంతి పుంజాన్ని ప్రయోగించగా.. విక్రమ్ ల్యాండర్ పై కేవలం 2 ఇంచుల సైజు, 20 గ్రాముల బరువు మాత్రమే ఉన్న రిఫ్లెక్టర్ ఆ కాంతిని తిరిగి వెనక్కి పంపగలిగిందని పేర్కొంది. దీంతో భవిష్యత్తులో చంద్రుడిపై లొకేషన్లను కచ్చితంగా గుర్తించే టెక్నాలజీ సక్సెస్ అయినట్లేనని తెలిపింది.

భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలను గుర్తించేందుకు ప్రస్తుతం భూమి నుంచి లేజర్ ను ప్రయోగిస్తున్నారు. అయితే, చంద్రుడి చుట్టూ తిరిగే ఆర్బిటర్ ల నుంచి చంద్రుడిపై ఉన్న వస్తువులపైకి లేజర్ ను ప్రయోగించి, కచ్చితమైన లొకేషన్ గుర్తించడంలో ఇంకా పలు ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విక్రమ్ పై తాము అమర్చి పంపిన ఎల్ఆర్ఏ పరికరం బాగా పని చేయడంతో ఈ టెక్నాలజీ దిశగా ముందడుగు వేశామని నాసా వెల్లడించింది. ఎల్ఆర్ఏ పరికరానికి ఎలాంటి పవర్ అవసరం లేనందున కొన్ని దశాబ్దాలపాటు పని చేయగలదని పేర్కొంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉన్న ఏకైక లొకేషన్ మార్కర్ గా విక్రమ్ భవిష్యత్తులో ఉపయోగపడనుందని వివరించింది.