
- భూతగాదాలే కారణమని నిర్ధారణ!
- వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు
మలక్ పేట, వెలుగు: సీపీఐ కౌన్సిల్ మెంబర్ చందూనాయక్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 9 మంది నిందితులను గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో నలుగురు పోలీసుల అదుపులో ఉండగా మరో ఐదుగురి కోసం పది బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హత్యకు భూతగాదాలే ప్రధాన కారణంగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. చందునాయక్కు గతంలో అనుచరుడిగా ఉన్న సీపీఐఎంఎల్ లీడర్ రాజేశ్ హత్యకు ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది.
కుంట్లూర్ పరిధిలో వేలాది గుడిసెలు వేయడంలో రాజేశ్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఏర్పడిన తగాదాలే చందూనాయక్ హత్యకు కారణమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధం కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. చందూనాయక్ ను నలుగురు కారులో వచ్చి హత్య చేయగా, వీరికి ఐదుగురు సహకరించినట్లు తెలిసింది.
రాజేశ్ హత్యకు ముందు రోజు సాయంత్రమే స్విఫ్ట్ కారును రెంట్ కు తీసుకుని రెక్కీ నిర్వహించారు. చందూనాయక్పై ఎనిమిది రౌండ్లు కాల్పులు జరపగా.. పోస్టుమార్టంలో 5 బుల్లెట్లు తొలగించారు. సంఘటన స్థలం వద్ద మూడు బుల్లెట్లు దొరికాయి. హత్యకు ఉపయోగించిన కారును మలక్పేట పోలీసులు స్వాధీనం చేసుకుని యాదగిరి, మున్నా, భాషా, రాయుడుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీపీఐ నాయకులు రవీంద్రాచారి, యాదిరెడ్డి పేర్లను కూడా పోలీసులు ఎఫ్ఆర్ఐలో చేర్చారు.