టెక్నికల్ ఎడ్యుకేషన్​లో మార్పు రావాలె

టెక్నికల్ ఎడ్యుకేషన్​లో మార్పు రావాలె
  • ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టు సిలబస్ ఉండాలె
  • ఆలిండియా వైస్ ఛాన్స్ లర్స్ కాన్ఫరెన్స్ లో వక్తలు

హైదరాబాద్, వెలుగు: ఇండస్ట్రీల అవసరాలు ఒకలా ఉంటే, స్టూడెంట్ల చదువులు ఇంకోలా ఉన్నాయని, నేటి తరానికి అవసరమయ్యేలా టెక్నికల్ ఎడ్యుకేషన్​లో మార్పులు తీసుకురావాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిలబస్​లో మార్పులు చేయాలని సూచించారు. శుక్రవారం హైటెక్ సిటీలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, జేఎన్టీయూహెచ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆలిండియా వైస్ చాన్స్​లర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. చీఫ్ గెస్ట్​గా హాజరైన సైయంట్ గ్రూప్ ఫౌండర్, ఏఐసీటీఈ షార్ట్, మీడియం టర్మ్ పర్స్​పెక్టివ్ ప్లాన్ ప్రిపరేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్​రెడ్డి మాట్లాడుతూ.. ఏటా 21 లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారని, వారిలో 15.3% మందికే నేటి అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం ఉంటోందని చెప్పారు.

2026 నాటికి దేశంలో టెక్నికల్ జాబ్స్ అవకాశాలు 75 లక్షలకు చేరే వీలుందని, కానీ ఈ స్థాయిలో నిపుణులు దొరకడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. హయ్యర్​ ఎడ్యుకేషన్​ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. స్టూడెంట్లకు ఎలాంటి స్కిల్స్ అవసరమో గుర్తించాలని, ట్రెండ్​కు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణలో పీజీ కోర్సుల్లో 76% అమ్మాయిలు చేరుతున్నారని, 24 శాతమే అబ్బాయిలు చేరారని చెప్పారు. ఇంజనీరింగ్,​ కంప్యూటర్ సైన్స్​లో 69% వరకు స్టూడెంట్లు చేరుతున్నారని చెప్పారు. సివిల్స్​ ఉద్యోగాలను ఎక్కువ మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు పొందుతున్నారన్నారు.