ధరణిలోకి చొరబడి భూముల మేత.. స్థలాల వివరాల్లో మార్పులు

ధరణిలోకి చొరబడి భూముల మేత.. స్థలాల వివరాల్లో మార్పులు
  • కలెక్టర్, సీసీఎల్ఏ​ అప్రూవల్ లేకుండానే 
  • సీక్రెట్​ యాక్సెస్​తో తతంగం నడిపించిన గత ప్రభుత్వంలోని పెద్దలు
  • సహకరించిన అప్పటి ఉన్నతాధికారి, టీఎస్​టీఎస్​లోని మరో ఆఫీసర్  
  • వేలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ, 
  • వివాదాస్పద భూములు పట్టా భూములుగా మార్పు
  • తమకు కావాల్సినోళ్ల పేర్ల మీద ధరణిలో ఎంట్రీ
  • రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ అక్రమాలు 
  • అక్రమంగా భూములు కొల్లగొట్టినట్టు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 
  • ఫోరెన్సిక్​ ఆడిటింగ్ ​చేయాలని సూత్రప్రాయ నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు:  గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్​లో ఎవరికీ తెలియకుండా భూముల వివరాలు మార్చేశారు. తహసీల్దార్, కలెక్టర్, సీసీఎల్​ఏ ప్రమేయం లేకుండానే ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, అటవీ, దేవాదాయ భూములతో పాటు వివాదాస్పద జాబితాలోని భూములను తమకు కావాల్సినోళ్ల పేరు మీద పట్టా భూములుగా నమోదు చేశారు.  ఏదైనా సమస్య పరిష్కారం కోసం ధరణి పోర్టల్​లో అప్లికేషన్​ పెట్టుకుంటే.. దానిపై క్షేత్రస్థాయి నుంచి తహసీల్దార్ పంపిన రిపోర్ట్​ను కలెక్టర్, సీసీఎల్ఏ పరిశీలించి మార్పులు చేసే విధానం అమల్లో ఉంది. అయితే అసలు అవేమీ లేకుండానే ధరణి పోర్టల్​లో సైబర్​ క్రైమ్​ చేసినట్టుగా భూముల వివరాలు మార్చేసినట్టు కాంగ్రెస్​ ప్రభుత్వం గుర్తించింది. ఇంట్లో దొంగలు పడి విలువైన వస్తువులు కొట్టేసిన మాదిరి.. ధరణి పోర్టల్​లోకి దొంగతనంగా ప్రవేశించి డిజిటల్​రికార్డుల్లో మార్పులు చేసినట్టు తెలిసింది. 

వేలాది కోట్ల విలువైన భూములను కొట్టేసేందుకే ధరణి పోర్టల్​ను తీసుకొచ్చారా? అనేలా తతంగం నడిపించినట్టు సమాచారం. ఈ వ్యవహారమంతా గత ప్రభుత్వంలోని ఒకరిద్దరు పెద్దలు, ఇద్దరు ఉన్నతాధికారులు కలిసి చేశారని రాష్ట్ర సర్కార్ అనుమానిస్తున్నది. దీంతో ధరణిలో జరిగిన వ్యవహారాలపై ఫోరెన్సిక్ ​ఆడిట్​ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ధరణి సమస్యలు, పోర్టల్​ రీకన్​స్ర్టక్షన్​పై ప్రభుత్వం కమిటీని నియమించింది. ఇప్పుడు ఫోరెన్సిక్​ ఆడిట్​చేసి, పోర్టల్​లో జరిగిన అక్రమాలను బయటకు తీసుకురావాలని భావిస్తున్నది.

ధరణి కంటే ముందు, ఆ తర్వాత నేచర్ ఆఫ్ ల్యాండ్, ల్యాండ్​క్లాసిఫికేషన్ లో ఏయే భూములను పట్టా భూములుగా మార్చారనే దానిపై వివరాలు సేకరిస్తున్నది. ధరణిలో రెండు రకాలుగా భూములను వర్గీకరించారు. ఒకటి పార్ట్–ఏ అంటే ఎలాంటి వివాదాలు లేని భూములు. రెండోది పార్ట్–బీ  అంటే నిషేధిత జాబితాలోని భూములు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా ఎలాంటి ప్రొసీడింగ్స్ లేకుండానే పార్ట్–ఏలోకి మార్చినట్టు ప్రభుత్వం గుర్తించింది. రంగారెడ్డి, మేడ్చల్​ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో వేలాది ఎకరాలు ఇలాగే కొట్టేసినట్టు తెలిసింది. 

చట్టానికి విరుద్ధంగా... 

ధరణి పోర్టల్​ను 2020 అక్టోబర్​లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతకంటే ముందు ‘ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్ చట్టం–2020’ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ధరణిలో ఉన్న భూముల డేటాలో మార్పులు చేసేందుకు ఎవరికీ అధికారం ఇవ్వలేదు. ఇందులో ఎమ్మార్వోలను జాయింట్ సబ్​రిజిస్ర్టార్​లుగా మార్చి.. కొనుగోళ్లు, అమ్మకాలు, కోర్టు నుంచి వచ్చే ఆదేశాలతో మాత్రమే మార్పులు చేసేందుకు వీలుగా చట్టంలో అనుమతులు ఇచ్చారు. ఇప్పటి వరకు ధరణిలో వివిధ సమస్యలపై వచ్చిన అప్లికేషన్లను ఎమ్మార్వో రిపోర్ట్​ఆధారంగా కలెక్టర్, సీసీఏల్​ఏ అప్రూవల్ తో పరిష్కరిస్తూ వస్తున్నారు. నిజానికి ఇదంతా చట్టంలో లేకుండానే కేవలం సర్క్యులర్​ద్వారా చేసుకుంటూ వస్తున్నారు. కానీ గత ప్రభుత్వంలో ఒకరిద్దరు పెద్దలు, ఓ ఉన్నతాధికారి, తెలంగాణ స్టేట్​టెక్నాలాజికల్​సర్వీసెస్​(టీఎస్ టీఎస్)లో పని చేసిన మరో అధికారి కలిసి తమకు కావాల్సిన భూములను ఎలాంటి అప్రూవల్స్ లేకుండా డైరెక్టుగా ధరణిలో ఇష్టారీతిన మార్చేసినట్టు రాష్ట్ర సర్కార్​ప్రాథమికంగా నిర్ధారించింది. 

టీఎస్​టీఎస్​లో పని చేసిన ఆ ఆఫీసర్​ను ప్రభుత్వం ఇప్పటికే తొలగించింది. ధరణి పోర్టల్​ నిర్వహణ మొత్తం ప్రైవేట్​కంపెనీ చేతిలో ఉన్నప్పటికీ, టీఎస్​టీఎస్ లోని ఆ అధికారికి పోర్టల్​యాక్సెస్ ను అప్పటి ప్రభుత్వం సీక్రెట్ గా ఇచ్చినట్టు తెలిసింది. ఈ అధికారి ద్వారానే అప్పటి ప్రభుత్వ పెద్దలు రూ.వేలాది కోట్ల విలువైన ప్రభుత్వ, అసైన్డ్, అటవీ, వక్ఫ్, వివాదాస్పద జాబితాలోని భూములను తమకు కావాల్సినోళ్ల పేర్ల మీద పట్టా భూములుగా మార్చేసుకున్నట్టు సమాచారం. ధరణి పోర్టల్​రూపకల్పన చేసిన ఉన్నతాధికారి ఆధ్వర్యంలోనే ఈ తతాంగం జరిగినట్టు ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఆ అధికారి వీఆర్ఎస్​ తీసుకున్నారు. పోర్టల్​లో జరిగిన ఈ మార్పులు ఎక్కడి నుంచి జరిగాయనే దానిపై ఐపీ అడ్రస్ ద్వారా గుర్తిస్తున్నారు. కాగా, పోర్టల్ లో మరికొన్ని మార్పులు నేరుగా ధరణి నిర్వహణ చూస్తున్న ప్రైవేటు కంపెనీ నుంచే చేసినట్టు తెలిసింది. 

ఆ నాలుగు జిల్లాల్లోనే ఎక్కువ..  

2017లో భూరికార్డుల ప్రక్షాళన చేపట్టిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్​మేనేజ్ మెంట్ సిస్టం (ఐఎల్ఆర్ఎంఎస్)ను తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆ వివరాలను ధరణి పోర్టల్ లోకి మార్చింది. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చే కంటే ముందు, భూరికార్డుల ప్రక్షాళనకు ముందు ఏయే భూములు ఏయే రికార్డుల్లో ఉన్నాయి? అనే దానిపై ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్​ మల్కాజ్​గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోనే భూముల వివరాలు మార్చినట్టు గుర్తించింది. పెద్దపెద్ద ప్రాజెక్టులు వచ్చే ప్రాంతాల్లోనే ఈ తతాంగం నడిపించినట్టు తెలుసుకున్నది. దీంతో 2015 కంటే ముందు, ఆ తర్వాత.. ప్రధానంగా 2017 నుంచి 2023 డిసెంబర్​వరకు ఏయే భూములను పట్టాలుగా మార్చారు? అనే వివరాలను బయటకు తీయాలని నిర్ణయించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ధరణి పోర్టల్​లో జరుగుతున్న అక్రమాలపై ఫోరెన్సిక్​ఆడిటింగ్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఫోరెన్సిక్ ఆడిటింగ్​చేయాల్సిందేనని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ప్రొసీడింగ్స్​లేకుండా వేల కోట్ల విలువైన భూములను అక్రమంగా ఎలా పట్టా భూములుగా మార్చారనేది ఆడిటింగ్ లో బయటపడుతుందని.. దీంతో బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని భావిస్తున్నారు. 

ఫోరెన్సిక్​ ఆడిటింగ్​లో ఏం చేస్తరు? 

ధరణి పోర్టల్​లో రికార్డుల క‌‌రెక్షన్ ఏ విధంగా జ‌‌రిగింది? నిబంధ‌‌న‌‌ల ప్రకారం చేశారా? లేదా అక్రమ ప‌‌ద్ధతుల్లో చేశారనే విష‌‌యం ఫోరెన్సిక్ ఆడిటింగ్​లో తెలిసిపోతుందని అధికారులు చెబుతున్నారు. ధరణి పోర్టల్, ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్​మేనేజ్ మెంట్ సిస్టం (ఐఎల్ఆర్ఎంఎస్) తేవడానికి ముందు వరకు ఉన్న రికార్డులను ఆధారంగా చేసుకుని.. ఏయే భూములను మార్చారో పూర్తి స్థాయిలో తేలుస్తారు. ధరణి పోర్టల్ వ్యవహారమంతా డిజిటల్​ కనుక.. ఆడిట్ కోసం అవసరమైన మొత్తం సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ప్రభుత్వం, సీసీఎల్​ఏ, పోర్టల్‌‌ను నిర్వహిస్తున్న ప్రైవేట్ ఏజెన్సీ మధ్య చట్టపరమైన ఒప్పందాలను రివ్యూ చేస్తారు. ధరణి పోర్టల్ డేటాబేస్‌‌లు పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. అనధికార యాక్సెస్, పోర్టల్ డేటాలో మార్పులను గుర్తించడానికి డిజిటల్ ఫోరెన్సిక్​ చేస్తారు. ఇందులో సర్వర్ లాగ్‌‌లు, యూజర్ యాక్సెస్ రికార్డులు, సిస్టమ్ కాన్ఫిగరేషన్‌‌లను విశ్లేషిస్తారు. కలెక్టర్, సీసీఎల్​ఏ మాత్రమే కాకుండా.. ఇంకెవరు ధరణి పోర్టల్​లో యాక్సెస్ నియంత్రణలు, అనుమతులు కలిగి ఉన్నారో చూస్తారు. వారి ద్వారా ఎలాంటి మార్పులు చేశారు? ఏయే ఐపీ అడ్రస్​ల నుంచి ఎలాంటి మార్పులు జరిగాయో? గుర్తిస్తారు. ఫలితంగా ఎవరెవరు? ఎన్ని భూముల వివరాల్లో ఏయే మార్పులు చేశారనేది తెలుస్తుంది.