నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో మేఘాల జాడ కనిపించడం లేదు. గత నాలుగైదు రోజుల నుంచి అక్కడక్కడ తేలికపాటి నుంచి జల్లులు పడుతున్నా... అన్ని చోట్ల ఉక్కపోత వాతావరణం ఉంటోంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 3, 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో వాతావరణంలో రేడియోషన్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎండల తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. వర్షాకాలంలో ఎండ తీవ్రత దానికి తోడు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగలే కాదు...రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా నమోదవుతున్నాయి. వాతావరణంలో మార్పులతో ఎండ తీవ్రత పెరుగుతోందంటున్నారు. గాలిలో తేమ శాతం తగ్గినప్పుడు... ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడు ఇలాంటి వెదర్ సిచ్చువేషన్ కామనేనని తెలిపారు.
నైరుతి సీజన్ లో ఆగస్టు నెల కీలకమైనది. ఈ నెలలో సాధారణంగా ముసురు వాతావరణం ఉండాలి. అయితే అరేబియా సముద్రంలో నైరుతి గాలులు బలహీనంగా ఉండటంతో పడమర నుంచి తేమ గాలులు రాష్ట్రంపైకి వీయడం లేదు. దీంతో పాటు అల్పపీడనాలు, ద్రోణులు ఏర్పడినా రాష్ట్రంపై పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఎండల తీవ్రత అధికంగా ఉందంటున్నారు. మరోవైపు వచ్చే మూడు రోజులు రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న వెల్లడించారు.
