చర్లపల్లి స్టేషన్ అభివృద్ధికి రూ.221 కోట్లు

చర్లపల్లి స్టేషన్ అభివృద్ధికి రూ.221 కోట్లు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో 3 ప్రధాన రైల్వే స్టేషన్లయిన సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై భారం తగ్గనుంది. పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు, ఎమ్ఎమ్ టీఎస్ రైళ్లు చర్లపల్లి స్టేషన్ లో ఆగేందుకు వీలుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా స్టేషన్ అభివృద్ధికి రైల్వే బోర్డు రూ.221 కోట్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. చర్లపల్లి స్టేషన్ ను నగర శివారులో ప్రత్యామ్నాయ స్టేషన్ గా అభివృద్ధి చేయాలని గతంలోనే నిర్ణయించారు.

సిటీకి తూర్పు భాగంలో సౌకర్యవంతమైన ప్రదేశంలో ఈ స్టేషన్ ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో భూ కేటాయింపుల విషయంలో సమన్వయం లేక చర్లపల్లి స్టేషన్ ని అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారు. ప్రస్తుతం ఉన్న స్థలంలోనే ప్రత్యామ్నాయ స్టేషన్ గా తీర్చిదిద్దేందుకు రైల్వే బోర్డు రూ.221 కోట్లు కేటాయించటం విశేషం. ఈ నిధులతో రైల్వే స్టేషన్ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.