
- పోలికలున్నాయన్న మసాచుసెట్స్ గవర్నర్ చార్లీ బేకర్
- ఫార్మా, లైఫ్సైన్సెస్లో ఒప్పందాలకు సిద్ధమని వెల్లడి
- హైదరాబాద్ అన్ని రకాలుగా అనుకూలమన్న కేటీఆర్
- అమెరికా కంపెనీలు రావాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: బోస్టన్, హైదరాబాద్ సిటీలకు చాలా పోలికలున్నాయని అమెరికాలోని మాసాచుసెట్స్ రాష్ట్ర గవర్నర్ చార్లీ బేకర్ అన్నారు. ఫార్మా, లైఫ్‌సైన్సెస్, ఐటీ సెక్టార్‌కు చెందిన చాలా సంస్థలు రెండు సిటీల్లోనూ ఉన్నాయని, హైదరాబాద్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఆయన అన్నారు. శుక్రవారం బోస్టన్‌లో నిర్వహించిన ‘గ్లోబల్ ఇన్నోవేషన్ 2022–హెల్త్‌కేర్ ఎట్ గ్లాన్స్’ సదస్సులో బేకర్‌తో పాటు మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. లైఫ్‌సైన్సెస్, ఫార్మా సెక్టార్లో పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోవాలని, దాని వల్ల కొత్త ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందని బేకర్ చెప్పారు. కరోనా సంక్షోభం మధ్య మసాచుసెట్స్‌లో చేపట్టిన హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్ గురించి వివరించారు. డిజిటలైజేషన్‌తో అవసరమైన వారికి వేగంగా చికిత్సలు ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. తెలంగాణలోని రెండు జిల్లాల్లో తాము కూడా హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్‌ను ప్రారంభించామని కేటీఆర్ చెప్పారు. లైఫ్ సైన్సెస్, ఐటీ, టెక్, డేటా సైంటిస్టుల కృషితో మరిన్ని అద్భుతమైన ఆవిష్కరణలు వస్తాయన్నారు. బయో, లైఫ్‌సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులకు హైదరాబాద్ అన్ని రకాలుగా అనుకూలమని, ఎన్నో అవకాశాలున్నాయని వివరించారు. నోవార్టిస్ లాంటి కంపెనీలు తమ రాష్ట్రంలో యూనిట్లు పెట్టాయని గుర్తు చేశారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, నిర్వాణ హెల్త్‌కేర్ చైర్పర్సన్ జాన్ స్కల్లీ, సీఈవో రవి అయిక తదితరులు పాల్గొన్నారు.