
యూటా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యక్తిగతంగా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయనకు అత్యంత సన్నిహితుడైన చార్లీ కిర్క్ను (Charlie Kirk) యూటా కాలేజ్ ఈవెంట్లో గుర్తుతెలియని దుండగుడు కాల్చి చంపేశాడు. కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ అయిన కిర్క్ మంచి వక్త. పలు క్యాంపస్లలో చర్చా కార్యక్రమాలను నిర్వహించి ఆయన మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారు. చార్లీ కిర్క్ వయసు 31 సంవత్సరాలు. కిర్క్ మరణం ట్రంప్కు వ్యక్తిగతంగా తీరని లోటేనని చెప్పక తప్పదు. చార్లీ కిర్క్ ఇక లేరని, ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అమెరికా యువతను, భావి తరాన్ని చార్లీ అర్థం చేసుకున్నంతగా మరెవరూ అర్థం చేసుకోలేరని.. యువతను ఆయనలా మరెవరూ ప్రేమించలేరని ట్రంప్ పోస్ట్ చేశారు.
కిర్క్పై కాల్పులు జరిపినట్టుగా భావిస్తూ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చార్లీని హత్య చేసిన ఉదంతం బాధ, ఆగ్రహం కలిగించాయని.. ఈ ఘోరానికి కారణమైన ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదని.. రాజకీయ హింసాత్మక ఘటనలకు పాల్పడిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని కిర్క్ హత్యపై ట్రంప్ ఘాటుగా స్పందించారు. అమెరికా కోసం కిర్క్ తన జీవితాన్నే అంకితం చేశారని.. ఆయన నిజమైన దేశ భక్తుడని ట్రంప్ కొనియాడారు. కిర్క్ లక్షలాది మంది యువతలో స్ఫూర్తి నింపాడని చెప్పారు.
చార్లీ కిర్క్ పూర్వాపరాల విషయానికొస్తే.. ఆయన తన పద్దెనిమిద ఏట.. 2012లో కొందరు మిత్రులతో కలిసి టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ (TPUSA) అనే కన్జర్వేటివ్ గ్రూప్ను స్థాపించారు. ఆయన తండ్రి ఒక ఆర్కిటెక్ట్. చికాగో శివారు ప్రాంతమైన ప్రాస్పెక్ట్ హైట్స్లో ఆయన బాల్యం సాగింది. చికాగో దగ్గరలోని కాలేజ్లో చదువుకున్నప్పటికీ ఆయన తన చదువును మధ్యలోనే ఆపేశారు. రాజకీయాల పట్ల అమితమైన ఇష్టంతో ఉండే ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి రావాలని తీవ్రంగా ప్రయత్నించారు.
అమెరికాలో పోస్ట్ మోడరనిజం అంశంపై విద్యావేత్తలతో, విద్యార్థులతో కాలేజ్ క్యాంపస్లకు వెళ్లి అర్థవంతమైన చర్చలను కిర్క్ నిర్వహించారు. ఆయన చర్చలకు ఎంతగానో పేరొచ్చింది. 2012లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా రెండోసారి ఎన్నికైన తర్వాత TPUSA కీలకంగా వ్యవహరించింది. TPUSAకి దాదాపు 850కి పైగా అమెరికన్ కాలేజీల్లో శాఖలు కూడా ఉన్నాయంటే కిర్క్ ఎంత కీలకంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. అమెరికా వ్యాప్తంగా పర్యటిస్తూ రిపబ్లికన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు వీర విధేయుడిగా కిర్క్కు పేరుంది.
TO MY GREAT FELLOW AMERICANS… pic.twitter.com/oRsrE5TTHr
— Donald J. Trump (@realDonaldTrump) September 11, 2025