- మరో ఇద్దరు జవాన్లకు గాయాలు
- బీజాపూర్ జిల్లాలో బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు
- తుపాకుల మోతతో దద్దరిల్లిన బస్తర్ అటవీ ప్రాంతం
- మావోయిస్టుల మృతదేహాలతోపాటు భారీగా
- ఆయుధాలు స్వాధీనం చేసుకున్న బలగాలు
- పీఎల్జీఏ వారోత్సవాల వేళ మావోయిస్టులకు ఎదురుదెబ్బ
భద్రాచలం, వెలుగు: చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకోగా.. తుపాకీ మోతలతో బస్తర్ అటవీప్రాంతం దద్దరిల్లింది. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు మృతి చెందారు.
మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలతోపాటు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బీజాపూర్, దంతెవాడ జిల్లాల బార్డర్‌లోని వెస్ట్ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలను జాయింట్ ఆపరేషన్ కోసం పంపించారు.
బీజాపూర్ జిల్లా గంగులూరు అడవుల్లో ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. తేరుకున్న భద్రతా బలగాలు సైతం ప్రతిదాడికి దిగాయని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్, బీజాపూర్ ఎస్పీ జితేంద్రయాదవ్ తెలిపారు. 12 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు చెప్పారు.
మావోయిస్టుల కాల్పుల్లో బీజాపూర్ జిల్లా డీఆర్‌జీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ మోనూ వడారీ, కానిస్టేబుళ్లు రమేశ్ సోడి, దుకారూ గోండి కన్నుమూసినట్టు వివరించారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడగా.. వారిని గంగులూరు ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించినట్టు చెప్పారు. సంఘటనా ప్రదేశంలో భారీ సంఖ్యలో ఎస్‌ఎల్‌ఆర్, 303 రైఫిల్స్, ఇన్సాస్ తుపాకులు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చనిపోయినవారిని గుర్తించేందుకు లొంగిపోయిన మావోయిస్టులను రప్పిస్తున్నామని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామన్నారు.
పీఎల్జీఏ వారోత్సవాల వేళ..
పీఎల్జీఏ వారోత్సవాల వేళ మావోయిస్టులకు ఇది గట్టి ఎదురుదెబ్బ. మరోవైపు పీఎల్జీఏ బెటాలియన్ వన్ కమాండర్ బార్సే దేవా లొంగిపోతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఆయన సుక్మా జిల్లా అడవులను సురక్షితమైన కారిడార్‌గా ఏర్పాటు చేసుకొని లొంగిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తున్నది.
ఈ క్రమంలో భారీ ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం. మృతులను గుర్తిస్తే కానీ ఎవరు చనిపోయారు? అగ్రనేతలు ఎవరైనా ఉన్నారా? అనే విషయాలు తెలియనున్నాయి. మరోవైపు బ్యాకప్ బలగాలతో గంగులూరు ప్రాంతంలో కార్డెన్ సెర్చ్ జరుగుతున్నది. పారిపోయిన మావోయిస్టుల కోసం అడవిని బలగాలు జల్లెడపడుతున్నాయి.
4 రోజుల క్రితమే ప్రధాని సమావేశం..
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో 4 రోజుల క్రితమే ఆలిండియా డీజీపీలు, ఐజీలతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశం నిర్వహించారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను నిర్మూలించాలని ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు.
ఈ క్రమంలోనే చత్తీస్‌గఢ్ పోలీసులు బుధవారం భారీ ఎన్‌కౌంటర్ జరగడం చర్చనీయాంశం అయింది. కాగా, ఈ కాల్పుల్లో మృతి చెందిన డీఆర్‌జీ జవాన్లకు చత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి విజయ్‌శర్మ శ్రద్ధాంజలి ఘటించారు. మావోయిస్టులపై విరుచుకుపడ్డ వీరజవాన్లు అంటూ కీర్తించారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ తుదిశ్వాసపై నడుస్తున్నదని, త్వరలోనే మావోయిస్టులందరినీ తుదముట్టిస్తామని హెచ్చరించారు.
