
హైదరాబాద్,వెలుగు: సైబర్ నేరస్థులు రూట్ మార్చి లాటరీ విన్నర్ అంటూ ఫోన్ చేసి అమాయకులను దగ్గరి నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. లక్కీ లాటరీ పేరుతో సైబర్ చోరీలకు పాల్పడుతున్నారు. రూ.25లక్షల నుంచి రూ.కోటి వరకు ఆశ చూపి ఎమౌంట్ ను క్లెయిన్ చేసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలంటూ బాధితుల నుంచి డబ్బులు దోచేస్తున్నారు. బీహార్ అడ్డాగా సాగుతున్న సైబర్ చీటింగ్ లో అత్యాశతో మోసపోతున్న వారు కొందరైతే సైబర్ నేరాలపై అవగాహన ఉన్న అలర్ట్ అవుతున్నారు. 4 రోజుల క్రితం సైబర్ దొంగల ట్రాప్ లో చిక్కిన ఓ యువకుడు క్యాష్ లాస్ కాకుండా చివరి నిమిషంలో తప్పించుకున్నాడు.
ఇలా ట్రాప్ చేశారు
ఏపీ కందుకూరుకు చెందిన గోపి ఫిలింనగర్ లో ఉంటూ సిటీలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. గోపికి ఈ నెల 11న ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఎయిర్‌టెల్, ఐడీయా, ఓడాఫోన్, జీయో మొబైల్ నెట్ వర్క్స్ నంబర్లతో తాము లక్కీ లాటరీ నిర్వహించామని కాల్ సారాంశం. దేశంలోని జియో కస్టమర్ల నంబర్స్ లో గోపి నంబర్ కి లక్కీ లాటరీ తగిలిందని చెప్పాడు. రూ.25లక్షలు గెలుచుకున్నందుకు కంగ్రాట్స్ చెప్పాడు. +916305941670 నంబర్ ఇచ్చి రూ.25లక్షలకు సంబందించిన ఎమౌంట్ క్లెయిమ్ చేసుకోవాలని చెప్పాడు.ఆ నంబర్ కి గోపి కాల్ చేశాడు. గోపి మొబైల్ ట్రూ కాలర్ లో ‘ఎస్బీఐ మెనీ’ పేరుతో నంబర్ డిస్ ప్లే అయ్యింది. ఫోన్ రిసీవ్ చేసుకున్న అవతలి వ్యక్తి తన పేరు రాహుల్ కుమార్ గా పరిచయం చేసుకున్నాడు. లాటరీ డబ్బు క్లెయిమ్ చేసుకోవడానికి రూల్స్ ప్రకారం ట్యాక్స్ కట్టాలన్నాడు. గోపి బ్యాంక్ అకౌంట్ నంబర్, ఫొటో ఇవ్వాలని సూచించాడు. దీంతో బ్యాంక్ అకౌంట్ నంబర్ తో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను గోపి పంపించాడు. .
మొబైల్ కంపెనీల లోగోస్ తో
కొద్ది సేపటి తరువాత ‘కేబీసీ ఆల్ సిమ్ కార్డ్ కంపెనీ లక్కీ డ్రా’ పేరుతో ఉన్న ఫేక్ లాటరీ కూపన్ గోపి వాట్సప్ కి వచ్చింది. అందులో గోపి ఫొటో, అకౌంట్ నం, లాటరీ ఫైల్ నం. 9955, రూ.25లక్షలు,చెల్లించాల్సిన ట్యాక్స్ రూ.12,100 వివరాలు ఉన్నాయి. ఢిల్లీ రాజేంద్ర భవన్ అడ్రెస్ తో ‘ లాటరీ సెక్టర్ కో-ఆపరేటెడ్ బై హోండా’ పేరుతో ప్రధాని మోడీ ఫొటో ప్రింట్ చేసి ఉంది. గోపి ఇదంతా నిజమేనని నమ్మాడు. రూ.12,100 చెల్లించేందుకు సిద్దమయ్యాడు. తన జియో నంబర్ కి రూ.25లక్షల లాటర్ తగిలిందని తల్లిదండ్రులతో పాటు ఫ్రెండ్స్ కి చెప్పుకున్నాడు. ఈ క్రమంలో గోపి ఫ్రెండ్ ఇదంతా ఫేక్ అని చెప్పాడు. సైబర్ నేరగాళ్ళు ట్రాప్ చేసినట్లు గుర్తించాడు. అప్రమత్తమైన గోపి సైబర్ నేరగాడు ఇచ్చిన అకౌంట్ లో డబ్బు డిపాజిట్ చేయలేదు. సైబర్ దొంగలు మళ్ళీ ఫోన్లు చేయడం ప్రారంభించారు. దీంతో గోపి ఆ నంబర్స్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు.
4 నెలల్లో మూడు కేసులు
ఇలాంటి లాటరీ ఫ్రాడ్ కేసులు గతేడాది హైదరాబాద్ కమిషనరేట్ లో 2,రాచకొండలో 4,సైబరాబాద్ లో 5 కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది మే,ఆగస్ట్ నెలల్లో 2 కేసులు నమోదయ్యాయి. చిక్కడపల్లికి చెందిన సుందర్‌సింగ్ అనే వ్యాపారి రూ.3.15లక్షలు మోసపోయాడు. సిమ్‌కార్డు నంబర్ కేబీసీ లాటరీలో రూ. 25 లక్షలు గెలుపొందారని నమ్మించారు. తమ ట్రాప్ లో చిక్కిన సుందర్ సింగ్ వద్ద రూ.16,500 దగ్గర్నుంచి మూడు విడతలుగా మొత్తం రూ.3.15 వసూలు చేశారు. సురేందర్ సిటీ సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.
నకిలీ చెక్కు పంపి..
ఇలాంటిదే మరో చీటింగ్ హయత్ నగర్ లో .జరిగింది. రూ.12.72లక్షల ఫేక్ చెక్కును కొరియర్ లో పంపిన సైబర్ నేరగాళ్లు బాధితుడి దగ్గరి నుంచి రూ.4.28లక్షలు వసూలు చేశారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన రూ.12.72 లక్షల చెక్ బాధితుడు చంద్రమౌళికి కొరియర్ లో చేరింది. నాప్‌టోల్ లక్కీ డీప్‌లో ప్రైజ్ మణీ గెలుచుకున్నారని నమ్మించారు. చెక్ అమౌంట్ డిపాజిట్ కావాలంటే సర్వీస్ చార్జీలు, ట్యాక్సెస్ చెల్లించాలని చెప్పారు. తన పేరుతో ఉన్న చెక్ ను చూసిన చంద్రమౌళి అది నిజమేనని నమ్మాడు. జులై 27 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు రూ.4.28లక్షలు డిపాజిట్ చేశాడు. తర్వాత సైబర్ నేరగాళ్ళకు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని గ్రహించి బాధితుడు చంద్రమౌళి రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు.