ఖమ్మంలో ఉంటూ.. సూర్యాపేటలో చోరీ: గోల్డ్ చోరీ కేసులో మహిళ అరెస్ట్

ఖమ్మంలో ఉంటూ.. సూర్యాపేటలో చోరీ: గోల్డ్ చోరీ కేసులో మహిళ అరెస్ట్

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన గోల్డ్ చోరీ కేసులో ఒకరి అరెస్ట్ అయ్యారు. జిల్లా పోలీస్ ఆఫీసులో ఎస్పీ నరసింహ మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. జిల్లా కేంద్రంలో కొద్దిరోజుల కింద శ్రీ సాయి సంతోషి జువెలర్స్‎లో జరిగిన గోల్డ్ చోరీ కేసులో ఐదు స్పెషల్ టీమ్‎లు దర్యాప్తు చేపట్టాయి. చోరీకి పాల్పడినది నేపాల్, జార్ఖండ్ కి చెందిన ఐదుమంది సభ్యుల ముఠాగా గుర్తించారు. ఆదివారం సూర్యాపేట హై టెక్ బస్ స్టాండ్ సమీపంలో పోలీసులు ఫింగర్ ప్రింట్స్ తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఖమ్మం జిల్లా నాయుడుపేటకు చెందిన మేకల యశోద అనే మహిళ అనుమానాస్పదంగా కనిపించింది. 

ఆమె బ్యాగును తనిఖీ చేయగా శ్రీసాయి సంతోషి జువెలరీ షాపులో చోరీకి గురైన కొన్ని ఆభరణాలు దొరికాయి. అదుపులోకి తీసుకుని స్టేషన్‌‌కు తరలించి విచారించగా చోరీ చేసినట్టు అంగీకరించింది. నేపాల్‌‌కు చెందిన నిందితుడు ప్రకాష్ అనిల్‌‌కుమార్‌‌(ఏ1)తో పాటు నేపాల్‌‌కు చెందిన అమర్‌‌ భట్‌‌ (ఏ6) ఖమ్మంలో గుర్ఖాగా పని చేస్తున్నారు. వీరికి యశోద ఆశ్రయం ఇవ్వగా.. కాలనీల్లో రెక్కీ నిర్వహిస్తూ చోరీలకు ప్లాన్ చేస్తున్నారు. 

అక్కడ చోరీ చేస్తే దొరికిపోతామని, సూర్యాపేటలో ప్లాన్ చేశారు. ప్రకాష్‌‌ అనిల్‌‌కుమార్‌‌కు తెలిసిన మరో వ్యక్తి నేపాల్‌‌కు చెందిన కడాక్‌‌ సింగ్‌‌ను పిలిపించుకుని, వీరితో పాటు జార్ఖండ్, బిహార్, యూపీకి చెందిన మరో ముగ్గురితో కలిసి చోరీ చేసినట్టు ఎస్పీ నరసింహ వివరించారు. నిందితురాలు యశోద  నుంచి రూ.14లక్షల విలువైన 14 తులాల గోల్డ్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, టౌన్ సీఐ వెంకటయ్య, ఎస్‌‌ఐ శివతేజ ఉన్నారు.