
- నల్లమలలో టూరిజం అభివృద్ధితో స్థానికులకు ఉపాధి
- ప్రత్యేక ప్యాకేజీ కోసం సీఎంను కలుస్తానంటున్న అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ
నాగర్కర్నూల్, వెలుగు: దట్టమైన అడవి మధ్య ప్రవహించే కృష్ణానదిని చుట్టేసే అందమైన కొండలు, కనువిందు చేసే వన్యప్రాణులు, వెలుగు చూడని పర్యాటక ప్రదేశాలకు నెలవైన నల్లమలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పర్యాటకులతో కళకళలాడుతున్న ఉమామహేశ్వరం, ఫర్హాబాద్ వ్యూ పాయింట్, మద్దిమడుగు, రాయలగండితో పాటు వెలుగులోకి రాని ప్రకృతి సహజ అందాలతో పర్యాటకులను కట్టిపడేసే ప్రాంతాలను అభివృద్ది చేసి స్థానిక చెంచులు, గిరిజనులు, యువతకు ఉపాధి కల్పించేందుకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కృషి చేస్తున్నారు.
ఆదరణకు నోచుకోని అక్కమహాదేవి గుహలు..
కృష్ణాతీరంలో తెలంగాణ ప్రాంతం పరిధిలో ఉన్న చారిత్రక అక్కమహాదేవి గుహలు ఆదరణకు నోచుకోవడం లేదు. ఏపీ వైపునుంచి రెగ్యులర్గా అక్కడి టూరిజం అధికారులు బోట్లు నడిపిస్తున్నారు. తెలంగాణ ఫారెస్ట్ శాఖకు గుడ్విల్ చెల్లిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. తెలంగాణ వైపు నుంచి ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు. ఆరు నెలల కింద ఎమ్మెల్యే పట్టుబట్టి ప్రారంభించిన అక్కమహాదేవి గుహల బోటును నిలిపివేశారు. 11వ శతాబ్దంలో వెలుగు చూసిన అక్కమహాదేవి గుహలకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. కృష్ణాతీరంలో సహజ శిలాతోరణంగా ఏర్పడిన గుహలకు కర్నాటక, ఏపీ నుంచి ప్రతిరోజు వేలాది మంది వస్తుంటారు.
తెలంగాణ తీర ప్రాంతంలో ఉన్న అక్కమహాదేవి గుహలకు బ్రహ్మగిరి(దోమలపెంట) నుంచి బోటింగ్ కల్పిస్తే స్థానిక యువతకు ఉపాధితో పాటు ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుంది. వీటితో పాటు దత్తపాదుకలు, కదళీవనానికి ఇక్కడి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఉమామహేశ్వర క్షేత్రంతో పాటు భోగ మహేశ్వరాన్ని అభివృద్ది చేయాల్సి ఉంది. మద్దిమడుగు వరకు మాత్రమే పర్యాటకులు, భక్తులను అనుమతిస్తున్నారు. మల్లెల తీర్థం, లొద్దిమల్లయ్య, సలేశ్వరం జలపాతాలతో కూడిన లోయలు ఉన్న ప్రాంతాలు బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువే.
మల్లెలతీర్థానికి ప్రస్తుతం పర్యాటకులను అనుమతించడం లేదు. భౌరాపూర్కు శివరాత్రి రోజు మాత్రమే అనుమతిస్తుండగా, శ్రీరామనవమి ముందు సలేశ్వరానికి మూడు రోజులు అనుమతిస్తారు. కుంచోనిమూల గుట్టపై ప్రతాప రుద్రుడి కాలంలో నిర్మించిన కోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. దీనిపై లండన్ ఐ తరహాలో జాయింట్ వీల్ ఏర్పాటు చేస్తే నల్లమల అందాలను ఆస్వాదించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చూడాల్సినవెన్నో..
నల్లమల అటవీప్రాంతలో నర్సింహుని వాగు, లొద్ది మల్లయ్య, అంతర్గంగ, ఆక్టోపస్ వ్యూ పాయింట్, వజ్రాల మడుగు, భైరవకోన, గీసుగండి, గున్నపెంట, గుండం,పెద్దమ్మగుడి, మార్కండేయ గుడి వంటి ప్రదేశాలు చూడాల్సిన ప్రదేశాలు. గతంలో నల్లమల టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, సోమశిల నుంచి బ్రహ్మగిరి వరకు అభివృద్ది చేయాల్సిన ప్రాంతాలను గుర్తించి నిధులు కేటాయించింది.
సోమశిల, సింగోటం, అక్కమహాదేవి గుహలు, కదళీవనం ప్రదేశాల ప్రస్తావన చేసింది. అక్కమహాదేవి గుహలకు వెళ్లేందుకు రెండు ఫ్లోటింగ్ జెట్టీలు, పై నుంచి నదితీరం వరకునడక దారి, సోలార్ లైటింగ్, గుహల లోపల కెమికల్ ట్రీట్మెంట్, పర్యాటకులకు కనీస వసతులు కల్పించేందుకు నిధులు కేటాయించింది. కదళీవనం వెళ్లేందుకు ట్రెక్కింగ్, నడకదారికై మెట్లు తదితర నిర్మాణాల ప్రస్తావన వచ్చింది.
సీఎంను కలిసి ప్రత్యేక ప్యాకేజీ కోరుతాం
నల్లమల అడవి అందాలను, అడవిలోని చారిత్రక, ఆధ్మాత్మిక ప్రదేశాలను బయటి ప్రపంచానికి పరిచయం చేయాలి. తెలంగాణ పర్యటకానికి నల్లమల చిరునామాగా చెప్పుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. కృష్ణానదిలో వాటర్ స్పోర్ట్స్, నల్లమల గుట్టల్లో ట్రెక్కింగ్, జంగిల్ సఫారీ, వాటర్ ఫాల్స్ చూసేందుకు ఏర్పాట్లు చేయాలి. అచ్చంపేట నియోజకవర్గంలోని యువతకు ఉపాధి కల్పించేందుకు పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కీలకం అవుతుంది. మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎంను కలిసి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరుతాను. - వంశీకృష్ణ, అచ్చంపేట ఎమ్మెల్యే