పూజల పేరుతో పురోహితుడికి వల.. రూ.5.99 లక్షలు కొట్టేసిన చీటర్లు

పూజల పేరుతో పురోహితుడికి వల.. రూ.5.99 లక్షలు కొట్టేసిన చీటర్లు

బషీర్​బాగ్​, వెలుగు: పూజల పేరుతో ఓ పురోహితుడిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. పురానాపూల్ కు చెందిన 52 ఏళ్ల పురోహితుడికి సైబర్ చీటర్స్ ఈ నెల 23న ఫోన్ చేశారు. సికింద్రాబాద్ మిలటరీ కార్యాలయం నుంచి కెప్టెన్ అమాన్ కుమార్ గా పరిచయం చేసుకున్నారు. తమ క్యాంప్ లో కర్నల్ అధికారి ఆరోగ్యం బాగాలేదని, 21 మంది పురోహితులతో 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేయాలని కోరారు. రూ.3 లక్షలు అడ్వాన్స్  ఇస్తామని నమ్మించారు.

వీడియో కాల్ చేయగా, యూనిఫామ్ లో ఉన్న స్కామర్స్ ను చూసి పురోహితుడు వారు చెప్పింది నిజమే అనుకున్నాడు. మొదటగా ఆయనకు ఫోన్ పే, గూగుల్ పేలో రూ.10 పంపించారు. తరువాత క్రెడిట్ కార్డు వివరాలు అడిగారు. పిన్ ఉపయోగించి మనీ రిక్వెస్ట్  పంపించాలని కోరారు. వారు చెప్పినట్లు పురోహితుడు పలు దఫాలుగా రూ.5 లక్షల 99 వేల 997 రిక్వెస్ట్​ అనుకొని స్కామర్స్ కు బదిలీ చేశాడు. ఆ తరువాత మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశాడు.