మొబైల్​ నెట్​వర్క్​ మారితే.. బంగారం గిఫ్ట్​ వస్తుందని చెప్పి మోసం

మొబైల్​ నెట్​వర్క్​ మారితే.. బంగారం గిఫ్ట్​ వస్తుందని చెప్పి మోసం
  • మాయమాటలు చెప్పి 2 తులాల బంగారంతో ఉడాయించిన దుండగుడు
  • ఆదిలాబాద్​జిల్లా కుంటాలలో ఘటన

కుంటాల, వెలుగు:   నెట్​వర్క్​ మారితే బంగారం గిఫ్ట్​గా వస్తుందని మహిళకు మాయమాటలు చెప్పి, ఆపై ఆమెకు స్ప్రే కొట్టి బంగారంతో ఉడాయించిన ఘటన ఆదిలాబాద్​జిల్లా కుంటాల మండలంలో జరిగింది.  కల్లూర్ గ్రామానికి చెందిన పెద్దమ్మ, పెంట లక్ష్మి శనివారం ఇంటి ముందు బీడీలు చుడుతున్నారు. గుర్తు తెలియని ఓ వ్యక్తి వారి వద్దకు వెళ్లి మాటలు కలిపాడు. మీరు వాడుతున్న మొబైల్​నెట్ వర్క్ సరిగా లేదని, జియో నెట్​వర్క్​కు మార్చుకుంటే బంగారం బహుమతిగా వస్తుందని నమ్మించాడు. 

తనకు కూడా రెండు తులాలు గిఫ్ట్​గా వచ్చిందని చెప్పి తన వద్ద ఉన్న డబ్బులు, బంగారాన్ని చూపించాడు. గ్రామ సమీపంలో ఉన్న వాసవి కాలేజ్​దగ్గర తమ ఆఫీసర్లు ఉన్నారని, అక్కడికి వస్తే గిఫ్ట్​గా వచ్చిన బంగారం ఇస్తానని చెప్పాడు.  ఆ మాటలు నమ్మిన పెద్దమ్మ అతడి బైక్​ఎక్కి వెళ్లింది. 

అయితే, దారి మధ్యలో బైక్​ఆపిన సదరు వ్యక్తి పెద్దమ్మపై స్ప్రే చల్లడంతో ఆమె స్పృహ కోల్పోయింది.  దీంతో ఆమె మెడలోని రెండు తులాల బంగారంతో ఉడాయించాడు. పది నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చిన పెద్దమ్మ జరిగిన విషయాన్ని గుర్తించి లబోదిబోమంది. విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నామని ఎస్సై హన్మాండ్లు తెలిపారు.