
- రాష్ట్ర అధ్యకుడు ఎర్ర సత్యనారాయణ
బషీర్బాగ్: బీసీలను మోసం చేస్తే సహించేది లేదని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యకుడు ఎర్ర సత్యనారాయణ అన్నారు. న్యాయబద్ధంగా ప్రశ్నించబడే ఆర్డినెన్స్ద్వారా 42 శాతం రిజర్వేషన్ల ప్రకటనపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివారం హైదర్ గూడ లోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఒత్తిడి చేయలేదని, బీసీ రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకించే స్థితిలో లేని పరిస్థితిని వాడుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఈ అంశాన్ని జాతీయ సమస్యగా మార్చే అవకాశమున్నా పట్టించుకోలేదన్నారు.
42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికలకే పరిమితం చేయకుండా విద్య, ఉద్యోగాల్లోనూ అమలు చేయాలని డిమాండ్చేశారు. రిజర్వేషన్ల అమలు కోసం వెంటనే రాజ్యాంగ సవరణ చేపట్టాలని కోరారు. నాయకులు కోలా జనార్ధన్, అయిలి వెంకన్న గౌడ్, దుర్గయ్య, బోయ గోపి, నాగుల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.