నేషనల్ హెరాల్డ్ కేసులో తీర్పు రిజర్వ్.. జూలై 29కి వాయిదా వేసిన రౌస్ అవెన్యూ కోర్టు

నేషనల్ హెరాల్డ్ కేసులో తీర్పు రిజర్వ్.. జూలై 29కి వాయిదా వేసిన రౌస్ అవెన్యూ కోర్టు

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభియోగాలు మోపుతూ దాఖలు చేసిన అనుబంధ చార్జ్‎ షీట్‎ను పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనే పిటిషన్‎పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 2025, జూలై 29కి జడ్జిమెంట్ వాయిదా వేసింది కోర్టు. ఈడీ దాఖలు చేసిన మెటీరియల్ ప్రాసిక్యూషన్.. ఈ కేసులో రాహుల్, సోనియాపై చర్యలు తీసుకోవడానికి అర్హత ఉందా లేదా అనే దానిపై రౌస్ అవెన్యూ కోర్టు ఇరువర్గాల వాదనలు విన్నది.

ఇరుపక్షాలు ఆర్గ్యుమెంట్స్ పూర్తి కావడంతో కాగ్నిజన్స్‌పై నిర్ణయాన్ని జూలై 29కి వాయిదా వేసింది న్యాయస్థానం. జూలై 29న తీర్పు వెలువడిన తర్వాత ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అభియోగాలు మోపుతూ ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీట్‎పై విచారణ జరుగుతుందా లేదా కొట్టివేయబడుతుందా అనేది తేలిపోనుంది. 

నేషనల్​ హెరాల్డ్​ వివాదం ఏంటి?

స్వాతంత్ర్యోద్యమ కాలంలో బ్రిటిష్‌‌‌‌ పాలకులకు వ్యతిరేకంగా ఇండియన్ల​గొంతు  వినిపించేందుకు 1938లో అప్పటి కాంగ్రెస్‌‌‌‌ పార్టీ అధ్యక్షుడు జవహర్‌‌‌‌లాల్‌‌‌‌ నెహ్రూ ‘నేషనల్‌‌‌‌ హెరాల్డ్‌‌‌‌’ పత్రికను ప్రారంభించారు. అసోసియేటెడ్‌‌‌‌ జర్నల్స్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌(ఏజేఎల్‌‌‌‌) సంస్థ ఆధ్వర్యంలో ఈ పత్రిక నడిచేది. ఇందులో 5వేల మంది స్వాతంత్ర్య సమరయోధులు భాగస్వాములుగా ఉండేవారు. నెహ్రూ ప్రధాన దాతగా వ్యవహరించారు. 2008లో నేషనల్‌‌‌‌ హెరాల్డ్‌‌‌‌ పత్రిక మూతపడే నాటికి రూ.90.25 కోట్ల మేర కాంగ్రెస్‌‌‌‌ పార్టీకి ఆ సంస్థ బకాయిపడింది. ఇది వడ్డీలేని రుణం. 

2009లో వరుసగా రెండో సారి యూపీఏ అధికారంలోకి వచ్చాక 2010లో లాభాపేక్షలేని దాతృసంస్థగా యంగ్‌‌‌‌ ఇండియన్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (వైఐఎల్‌‌‌‌) ఆవిర్భవించింది. నేషనల్‌‌‌‌ హెరాల్డ్‌‌‌‌, ఏజేఎల్‌‌‌‌ అప్పులు, ఆస్తులన్నీ వైఐఎల్​కు దఖలుపడిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం కీలక మలుపులు తిరిగింది. నేషనల్‌‌‌‌ హెరాల్డ్‌‌‌‌ విషయంలో భారీ కుంభకోణం జరిగిందని, సోనియా, రాహుల్‌‌‌‌ గాంధీ తదితరులకు దీనిలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ రాజకీయ నాయకుడు, న్యాయవాది సుబ్రమణ్య స్వామి 2014 జూన్ 26న ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీన్ని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పరిగణనలోకి తీసుకున్న తర్వాత 2021లో ఈడీ దర్యాప్తు ప్రారంభమైంది. 

సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మొదటి కుటుంబం, ఆమె కుమారుడు రాహుల్, దివంగత కాంగ్రెస్ నాయకులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌‌‌‌తో పాటు సుమన్​ దూబే, పిట్రోడా, ప్రైవేట్ కంపెనీ యంగ్ ఇండియన్ సహా అనేక మంది ప్రముఖ రాజకీయ ప్రముఖులకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఈడీ అభియోగాలు నమోదుచేసింది. ఈ  కేసులో ఇప్పటికే  సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను ఈడీ విచారించి, స్టేట్‌‌‌‌మెంట్లను రికార్డు చేసింది.