
జకార్తా: ఇండోనేషియాలోని తనింబర్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. యూఎస్ జియోలాజికల్ సర్వే, పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ప్రకారం.. సోమవారం (జూలై 14) ఉదయం 5.49 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించిందని, తూర్పు మలుకు ప్రావిన్స్‌లోని తువాల్‌కు పశ్చిమాన 177 కిలోమీటర్ల దూరంలో 80 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని వెల్లడించాయి.
భూప్రకంపనలతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం నేపథ్యంలో ఇండోనేషియా ప్రభుత్వం అప్రమత్తమైంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహయక చర్యలు చేపట్టింది. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఎలాంటి సునామీ ముప్పు లేదని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది.
2023 జనవరిలో కూడా తనింబర్ దీవుల సమీపంలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని తర్వాత 6.7 తీవ్రతతో వచ్చిన తాజా భూకంపమే అతిపెద్దది. ఈ భూకంపం కారణంగా కనీసం 15 ఇళ్లు, రెండు పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయి. కానీ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఇండోనేషియాలోని మలుకు ప్రావిన్స్‌లో భాగమైన తనింబర్ దీవులు, పశ్చిమాన తైమూర్, తూర్పున న్యూ గినియా మధ్య అరాఫురా సముద్రంలో ఉన్న దాదాపు 30 ద్వీపాలను కలిగి ఉన్నాయి.