
నిర్మల్, వెలుగు: ప్రతి ఏటా వర్షాకాలంలో ముంపునకు గురవుతున్న స్థానిక సీఎన్ఆర్ కాలనీని రక్షించేందుకు సమీప స్వర్ణ వాగులోని చెక్ డ్యామ్‌ను పేల్చి ఎత్తును తగ్గించారు. ఇటీవల కలెక్టర్ అభిలాష అభినవ్ జీఎన్ఆర్ కాలనీని సందర్శించి ముంపు పరిస్థితులను తెలుసుకున్నారు. వాగులోని ఎత్తుగా ఉన్న చెక్ డ్యామ్ కారణంగానే పక్కనే ఉన్న ఈ కాలనీ ముంపునకు గురవుతోందని సంబంధిత అధికారులు నిర్ధారించారు.
దీంతో ఎత్తు తగ్గింపు పనులకు అవసరమైన నిధులను ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మంజూరు చేయించగా కొలత మేరకు గురువారం డైనమైట్‌తో పేల్చివేశారు. చెక్ డ్యామ్ ఎత్తు తగ్గడంతో వాగులోని వరద ప్రవాహం జీఎన్ఆర్ కాలనీలోకి చేరే అవకాశం ఉండదని, వర్షాకాలంలో వరద ముప్పు తప్పనుందని అధికారులు పేర్కొన్నారు. దీంతో కాలనీవాసులు, సిద్దాపూర్, ఆదర్శ నగర్, ఈద్గామ్ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు