
వయసుతో పనిలేకుండా మొటిమలు, వాటి వల్ల ఏర్పడే మచ్చలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే, ఇంట్లో దొరికే పదార్థాలతోనే మొటిమలు రాకుండా చేయొచ్చు. ముఖంపై మచ్చలు పడకుండా జాగ్రత్తపడొచ్చు. కలబందలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ మొటిమల్ని పోగొడతాయి. కలబంద గుజ్జును మచ్చలమీద మసాజ్ చేయాలి. తర్వాత ముఖాన్ని చల్లనినీళ్లతో కడగాలి. వారానికి రెండు నుంచి మూడు సార్లు ఇలా చేస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు పోతాయి. కలబంద గుజ్జులో మూడు చుక్కలు టీ ట్రీ ఆయిల్ కలిపి, మచ్చలపైన రాసి పావుగంట తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తేనెలోని యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ యాక్నే సమస్యను దూరం చేస్తాయి. మొటిమల వల్ల వచ్చే మచ్చలకు తేనె చెక్ పెడుతుంది. రాత్రి నిద్రపోయే ముందు మొటిమలపై తేనె రాసి టిష్యూ వేసుకుని పడుకోవాలి. తెల్లారాక గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. లేదా 2 – 3 యాస్ప్రిన్ మాత్రలు పొడిచేసి, అందులో రెండు టీస్పూన్ల తేనె కలిపి మొటిమలపై రాయాలి. పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. రోజుకోసారి ఇలా చేస్తే ముఖంపై మొటిమలు పోతాయి.