బోన్​ మ్యారో సర్జరీతో తలసేమియాకు చెక్

బోన్​ మ్యారో సర్జరీతో తలసేమియాకు చెక్
  • రెడ్​క్రాస్​ సొసైటీ చొరవ, సంకల్ప్​ ఇండియా ఫౌండేషన్​ చేయూత
  • బోన్​మ్యారో ట్రాన్స్​ప్లాంటేషన్​తో చిన్నారులకు పునర్జన్మ
  • తొమ్మిది మందికి హెచ్ఎల్ఏ తొలిదశ​ పరీక్షలు పూర్తి
  • తదుపరి టెస్టుల కోసం బెంగళూరు హాస్పిటల్​కు ఆరుగురు
  • ఒక్కో ఆపరేషన్​కు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు ఖర్చు

మంచిర్యాల, వెలుగు: తలసేమియా బారిన పడి నరకం అనుభవిస్తున్న చిన్నారులకు బోన్​మ్యారో ట్రాన్స్​ప్లాంటేషన్  ద్వారా పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. రెడ్​క్రాస్​ సొసైటీ చొరవ, సంకల్ప్​ ఇండియా ఫౌండేషన్​ సహకారంతో బెంగళూరులోని భగవాన్​ మహవీర్​ జైన్​ హాస్పిటల్​లో ఈ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. తలసేమియా శాశ్వత నివారణకు బోన్​మ్యారో ట్రాన్స్​ప్లాంటేషన్​ ఒక్కటే మార్గం. దీనికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పైగా ఖర్చువుతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో ఎక్కువ మంది పేద కుటుంబాల పిల్లలే. లక్షలు ఖర్చుపెట్టి ఆపరేషన్​ చేయించే స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో నెలనెలా రక్తం ఎక్కించడానికి అవస్థలు పడుతున్నారు.

రాష్ట్రంలో 10వేల మంది.. 

రాష్ట్రవ్యాప్తంగా తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులు దాదాపు 10 వేల మంది ఉన్నారు. ఉత్తర తెలంగాణలో మెజారిటీ సంఖ్యలోఉండగా, ఇందులో ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోనే 2 వేల మందికి పైగా ఉన్నారు. ఇది జన్యు సంబంధమైన వ్యాధి. ఎముక మూలుగులోని హిమోగ్లోబిన్​లో ఉండే ఎర్ర రక్తకణాల ఉత్పత్తి నిలిచిపోతుంది. దీంతో శరీరానికి అవసరమైనంత రక్తం ఉత్పత్తి కాదు. ఒకవేళ ఉత్పత్తి అయినా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. హిమోగ్లోబిన్​ నిల్వలు పడిపోయిన ప్రతిసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. సకాలంలో రక్తం అందించకపోతే ప్రాణాలకే ప్రమాదం. మంచిర్యాలలోని రెడ్​క్రాస్​ బ్లడ్​బ్యాంక్​లో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్​ జిల్లాల నుంచి వచ్చే చిన్నారులకు ప్రతి నెలా రక్తం ఎక్కిస్తున్నారు. రక్తదాతల సహకారంతో ఎంతోమంది పిల్లల ప్రాణాలను కాపాడుతున్నారు.

దాతల సహకారంతో పునర్జన్మ..

మంచిర్యాల గర్నమెంట్​ హాస్పిటల్​లోని బ్లడ్​ బ్యాంక్​ ద్వారా తలసేమియా బాధిత చిన్నారులకు ఫ్రీగా రక్తం అందిస్తున్నాం. ఇటీవల సంకల్ప్​ ఇండియా ఫౌండేషన్​ ద్వారా మహవీర్​ జైన్​ హాస్పిటల్​లో పేద పిల్లలకు బోన్​ మ్యారో ట్రాన్స్​ప్లాంటేషన్​ చేయిస్తున్నాం. ఇందుకయ్యే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షలు చెల్లిస్తుంది. ఆర్థిక పరిస్థితిని బట్టి పిల్లల తల్లిదండ్రులు మరో రూ.3లక్షల దాకా భరించాలి. మిగిలిన మొత్తాన్ని దాతల సహకారంతో సంకల్ప్​ ఇండియా ఫౌండేషన్​ సమకూర్చుతుంది. దాతలు ముందుకు వస్తే మరికొందరు పిల్లల ప్రాణాలను కాపాడవచ్చు

రెడ్​క్రాస్​ చొరవ, సంకల్ప్​ చేయూత..

మంచిర్యాల గవర్నమెంట్​ హాస్పిటల్​లోని ఇండియన్​ రెడ్​క్రాస్​ సొసైటీ బ్లడ్​ బ్యాంక్​ ద్వారా చాలా కాలం నుంచి తలసేమియా చిన్నారులకు రక్తం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సంకల్ప్​ ఇండియా ఫౌండేషన్​ ద్వారా మహవీర్​ జైన్​ హాస్పిటల్​లో పేద పిల్లలకు బోన్​మ్యారో ట్రాన్స్​ప్లాంటేషన్​ చేయిస్తున్నారు. రామకృష్ణాపూర్​కు చెందిన వేల్పుల అయన(7) అనే చిన్నారికి ఈ నెల 8న ఆపరేషన్​ జరిగింది. ఇటీవల నిర్వహించిన హ్యూమన్​ ల్యూకోసైట్​ యాంటీజెన్(హెచ్ఎల్ఏ) టైపింగ్​ క్యాంప్​లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన బాధితులకు తొలి దశ టెస్టులు చేశారు. 

తొమ్మిది మందికి వారి తల్లిదండ్రులు, తోబుట్టువుల బోన్​ మ్యారో మ్యాచ్​ అయింది. వారిలో ఆరుగురికి తుది దశ టెస్టులు చేసి ఆపరేషన్లు నిర్వహించేందుకు మహవీర్​ జైన్​ హాస్పిటల్​కు ఆదివారం పంపించారు.  వీరిలో నేరెళ్ల పండు (మందమర్రి), బానాల శివకుమార్​ (కౌటాల), కొత్తపల్లి భార్గవ్​(చెన్నూర్​), కె.అజయ్​ (జగిత్యాల), కె.అశ్విత (జగిత్యాల), దుర్గం వినయ్​ (కోటపల్లి) ఉన్నారు. వీరికి బెంగుళూర్​లో టెస్ట్​లు పూర్తి చేశారు. రెండు నెలల తరువాత వీరికి బోన్​ మ్యారో సర్జరీలు చేయనున్నారు. అలాగే సింగరేణి సంస్థ ఆర్థిక సహకారంతో హైదరాబాద్​లోని ఓ కార్పొరేట్​ హాస్పిటల్​లో ముగ్గురు చిన్నారులకు బోన్​మ్యారో ట్రాన్స్​ప్లాంటేషన్​ చేశారు.

అయనకు పునర్జన్మ..

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​కు చెందిన వేల్పుల సతీశ్, రాణి దంపతుల కూతురు అయన(7) ఏడాదిన్నర వయసులో తలసేమియాను గుర్తించారు. అప్పటి నుంచి మంచిర్యాల గవర్నమెంట్​ హాస్పిటల్​లోని ఐఆర్​సీఎస్​ బ్లడ్​బ్యాంక్​లో రక్తం ఎక్కిస్తున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన క్యాంప్​లో తల్లిదండ్రులతో పాటు అన్న ప్రశ్నిత్(12)కు బోన్​ మ్యారో టెస్ట్​ చేయగా, ప్రశ్నిత్​తో మ్యాచ్​ అయింది. ఈ నెల 8న బెంగళూరులోని మహవీర్​ జైన్​ హాస్పిటల్​లో ప్రశ్నిత్​ నుంచి బోన్​ మ్యారో సేకరించి అయనకు ట్రాన్స్​ప్లాంటేషన్​ చేశారు. ప్రస్తుతం బాలిక అక్కడే కోలుకుంటోంది. ఆపరేషన్​ తర్వాత మూడు నెలలపాటు హాస్పిటల్​లోనే ఉండి ట్రీట్​మెంట్​ తీసుకోవాల్సి ఉంటుందని తండ్రి సతీశ్​​తెలిపాడు..