ఉపాధి హామీ అక్రమాలకు చెక్​!

 ఉపాధి హామీ అక్రమాలకు చెక్​!
  • ఎన్ఎంఎంఎస్​ యాప్​లో కూలీల అటెండెన్స్..
  • వర్క్​సైట్, ఫొటో అప్​లోడ్​ చేస్తేనే వేతనం
  •  గైడ్​లైన్స్​ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
  •  పక్కాగా అమలు చేస్తున్న జిల్లా అధికారులు

మెదక్, వెలుగు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) అవకతవకలకు చెక్​ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కూలీలు పనులు చేయకున్నా.. చేసినట్టు రికార్డు చేయడం, ఇదివరకు చేసిన పనులనే మళ్లీ చేయడం వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ‘నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్)  తప్పక అమలు చేయాలని ఆదేశించింది. దీంతో యాప్​లో కూలీల అటెండెన్స్.. వర్క్​సైట్, ఫొటో అప్​లోడ్​ చేస్తేనే కూలీలకు వేతనం అందనుండడంతో ఉమ్మడి జిల్లాలో సంబంధిత  అధికారులు పక్కాగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నారు. ఉపాధి హామీ పనుల్లో  కూలీల పనులకు రాకున్నా వచ్చినట్టు మస్టర్లు వేయడం.. అలాగే గతంలో చేసిన పనులనే  కొత్తగా చేసినట్టు  రికార్డుల్లో చూపి అవకతవకలకు పాల్పడటం వంటి సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూలీల అటెండెన్స్, పనుల నమోదు మాన్యువల్​గా చేస్తుండడం వల్ల అక్రమాలకు అవకాశం కలుగుతుండడంతో టెక్నాలజీతో చెక్​పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. అక్రమాల కట్టడికి  గతేడాది ఎన్ఎంఎంఎస్​ యాప్​ను రూపొందించింది. అన్ని వర్క్​ సైట్స్​లో అటెండెన్స్​ ఎన్​ఎంఎంఎస్​ యాప్​ ద్వారా క్యాప్చర్​ చేయాలని ఆదేశించింది. అయితే ఇంతకాలం అది నామ మాత్రంగానే  అమలైంది. ఇటీవల   క్షేత్రస్థాయిలో అమలవుతలేదన్న రిపోర్టుతో ఎన్​ఎంఎంఎస్​ను తప్పక అమలు చేయాలని  కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ  డైరెక్టర్​రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో  స్టేట్​పంచాయతీరాజ్​ రూరల్ డెవలప్​మెంట్​ కమిషనర్ శరత్​ అన్ని జిల్లాల డీఆర్డీవోలకు ఆర్డర్స్​ఇవ్వడంతో  ఈ నెల 16 నుంచి  ఎన్ఎంఎంఎస్ ను​ అమలు చేస్తున్నారు. 
 

100 శాతం అమలు చేయాల్సిందే..
 అన్ని గ్రామ పంచాయతీల్లో 100 శాతం అమలు చేయాలని ఆదేశాలు వచ్చాయి. 20 లేదా అంతకంటే ఎక్కువ మంది లేబర్ కు మస్టర్​రోల్స్​ జారీ చేసిన అన్ని వర్క్​సైట్లలో కూలీల అటెండెన్స్​మేట్లు తప్పక ఎన్​ఎంఎంఎస్​ యాప్​ లో  నమోదు చేయాలి. వర్క్ సైట్ ఫొటో తీసి  సైట్​లో అప్ లోడ్ చేస్తేనే కూలీలకు వేతనం అందనుంది. ఇంకా ఎక్కడైనా మేట్ల అవసరం ఉంటే వెంటనే నియమించుకుని వారి వివరాలు రిజిస్టర్​ చేయాలని, కొత్తగా విధుల్లో చేరిన మేట్లకు ఎన్​ఎంఎంఎస్  అప్​లోడ్​పై  ట్రైనింగ్​ ఇవ్వాలని సూచించారు. ఇలా ఎన్​ఎంఎంఎస్​ ద్వారా కూలీల అటెండెన్స్​లో ఎలాంటి అవకతవకలకు ఛాన్స్​ ఉండదు. అలాగే లొకేషన్​మ్యాప్​ల ఆధారంగా వర్క్​ సైట్​ ఫొటో అప్​లోడ్​ చేయడం వల్ల ఇదివరకు చేసిన పనినే మళ్లీ నమోదు చేసేందుకు వీలుండదు.  లేబర్​ అటెండెన్స్​ నమోదు చేసినందుకుగాను  మేట్​లకు ఉపాధి కూలీలకు నిర్ధేశించిన ఒకరోజు పూర్తి వేతనాన్ని ఇస్తారు. యాప్ ద్వారా వర్క్​ సైట్​ ఫొటో క్యాప్చర్ చేయడంలో ఏదైనా టెక్నికల్​సమస్య ఏర్పడితే ఎన్ఆర్ఈజీఎస్​  సాఫ్ట్​వేర్​లో  మాన్యువల్​గా అటెండెన్స్ నమోదు చేసే సదుపాయం ఉంది.  
 

పబ్లిక్​ డొమైన్​లో ఫొటోలు
ఉపాధి హామీ స్కీం కింద గ్రామాల్లో చేపట్టే పనులకు  సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ ​వెబ్​సైట్​లోని పబ్లిక్​ డొమైన్​లో అప్ లోడ్​ చేస్తారు. దీని వల్ల దేశ వ్యాప్తంగా ఏ గ్రామం వారైనా తమ ఊరిలో ఉపాధి హామీ స్కీం కింద చేపట్టిన పనుల గురించి తెలుసుకునే ఛాన్స్​ ఉంటుంది. పనుల్లో పారదర్శకత కోసం ఇలా చేసిన పనుల ఫొటోలు పబ్లిక్​ డొమైన్​లో పెట్టాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించిందని సంబంధిత అధికారి తెలిపారు. 


ఇంప్లిమెంట్ చేస్తున్నాం
రాష్ట్ర పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్​మెంట్​కమిషనర్ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 16 నుంచి ఎన్ఎంఎంఎస్ ను పక్కాగా అమలు చేస్తున్నం.  మేట్లు కూలీల అటెండెన్స్ ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారు. వర్క్ సైట్ ఫొటోలు సెల్ ఫోన్ లో  తీసి సైట్​లో అప్ లోడ్ చేస్తున్నారు.                                            – రాజ్ కుమార్, ఏపీవో, హవేలీ ఘనపూర్


 ఉమ్మడి జిల్లాలో జాబ్​ కార్డుల వివరాలు..
  మొత్తం  కార్డులు :   6,81,305
 యాక్టివ్ కార్డులు   : 4,06,628
 యాక్టివ్​ లేబర్​ :     7,46,557